మా పార్టీలో చేరండి ఎంపీగా గెలిపించుకుంటాం : నితిన్ గ‌డ్క‌రీకి ఉద్ధ‌వ్ ఠాక్రే

మా పార్టీలో చేరండి ఎంపీగా గెలిపించుకుంటాం : నితిన్ గ‌డ్క‌రీకి ఉద్ధ‌వ్ ఠాక్రే

ముంబై : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి నితిన్ గడ్కరీ విజయం సాధించేలా విపక్షం సహకరిస్తుందని అన్నారు. యావత్మాల్ జిల్లా పుసాద్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ గతంలో బీజేపీ టార్గెట్ చేసిన మాజీ కాంగ్రెస్ నేత కృపాశంకర్ సింగ్ పేరు సైతం పార్టీ తొలి జాబితాలో ఉన్నా గడ్కరీ పేరు మాత్రం గల్లంతైందని, బీజేపీ గడ్కరీని అవమానించిందని ఆరోపించారు. బీజేపీలో మీకు అవమానం ఎదురైతే మహా వికాస్ అఘడి (సేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్)లో చేరాలని తాను గతంలో గడ్కరీని కోరానని, మళ్లీ అదే విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. గడ్కరీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేలా తాము చూసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే గడ్కరీకి మంత్రి పదవి ఇస్తామని పేర్కొన్నారు. కాగా, గడ్కరీపై ఠాక్రే వ్యాఖ్యల పట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. వీధిలో ఓ వ్యక్తి ఒకరిని అమెరికా అధ్యక్షుడిని చేస్తానని అన్నట్టు ఠాక్రే వ్యాఖ్యలున్నాయని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గడ్కరీ బీజేపీలో ప్రముఖ నేతని, అయితే మహారాష్ట్రలో బీజేపీ, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ముగియకపోవడంతో రాష్ట్రం నుంచి ఎవరి పేర్లు తొలి జాబితాలో లేవని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos