రవిప్రకాశ్ కు ప్రశ్నల వర్షం..

సంతకాల ఫోర్జరీ,నిధులు మళ్లింపు,లోగోల అక్రమ విక్రయం కేసులకు సంబంధించి విచారణకు హాజరైన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే రవిప్రకాశ్‌ మాత్రం విచారణలో పోలీసులకు సహకరించలేదని ఏమడిగినా దాటవేత సమాధానాలు,పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రవిప్రకాష్ ను ఉదయం 1130 నుంచి రాత్రి 10:45 వరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆయన గందరగోళ పరిచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గురువారం నాడు కూడా విచారణకు రావాలని ఆదేశించి ఆయనను ఇంటికి పంపించారు.పోలీసులు తెప్పించిన భోజనాన్ని నిరాకరించి తనకు, వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులకు ఇంటి నుంచే భోజనం తెప్పించుకున్నారు.విచారణలో పోలసులు అడిగిన ప్రశ్నలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  1. మీడియా తరపున ధైర్యంగా పోరాడుతామన్న మీరు పోలీసు నోటీసులను తిరస్కరించి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు.?
  2. మీరు ధర్మ యుద్ధం చేస్తే పారిపోవాల్సిన అవసరం ఏముంది.?
  3. ఎబిసిఎల్ లో 90శాతం పెట్టుబడి దారు అయిన యజమాని, ఆయన షేర్‌ అమ్ముకోవడం తప్పా?
  4. మెజార్టీ ఓనర్‌ మీ అనుమతితోనే నిర్ణయాలు తీసుకోవాలా.?
  5. 8.5 శాతం వాటాదారు అయిన మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా మీ షేర్లు అమ్ముకోవడం న్యాయమా.?
  6. 20/02/2018 లోనే శివాజీ మీకు మొత్తం డబ్బు చెల్లిస్తే 17/03/2019 దాకా అతనికి షేర్లు బదిలీ చేయకుండా ఉంచడంలో
    ఆంతర్యం ఏమిటి? ఆయనను బెదిరించి బదిలీని ఆపారా? లేదా ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర ఏమిటి.?
  7. మీరు తయారు చేసుకున్న, మీ మధ్య సాగిన అన్ని మెయిల్స్‌ లో కూడా 13/04/2019 నాడే మొత్తం కుట్రకు సంబంధించిన దస్తావేజులను తయారు చేశారు కదా? 13/04/2019 నాడు మీరు తయారు చేసిన డాక్యుమెంట్లు  20/02/2018  నాటి తేదీలో ప్రింటు చేసి, కేసు వేయటం చట్టాన్ని 99 శాతం షేర్‌ హోల్డర్స్‌ని, ప్రజలని మోసం చేయటం కాదా.?
  8. మీ ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయనను తీసేయటం, దాన్ని MCA వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయటం మోసం కాదా?
  9. తాను రాజీనామా చేయలేదని మీ కంపెనీ సెక్రటరీ MCAకు ఫిర్యాదు చేయటం వాస్తవమా? కాదా?
  10. మీరు కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ మొత్తం కంపెనీ నాదే అని వాదించడం, తప్పుడు ప్రచారం చేయడం, మీరు ఆ కంపెనీని కబ్జా చేయడం కాదా.?
  11. ఒక సంస్థలో యజమానికి, ఉద్యోగికి (మీకు) మధ్య వివాదాన్ని మీడియా యుద్ధంగా చూపించడంలో వాస్తవం ఏమిటి.?
  12. అలాందా మీడియాకు శ్రీనిరాజుకి జరిగిన ఒప్పందంలో మీరు కూడా సంతకం చేశారు కదా. మరి అది మోసం ఎలా అవుతుంది.?
  13. అలందా వాటాల మార్పిడి, వారి డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన అన్ని రిజల్యూషన్లపై మీరే సంతకం చేశారా..? లేదా.?
  14. మీ సంతంకంతోనే డైరెక్టర్లుగా నియమితులైన వారు కంపెనీ కార్యకలాపాలలో పాల్గొనకుండా మీరు అడ్డుకున్నారా.? లేదా.?
  15. కంపెనీలో 90 శాతం వాటా ఉన్న వాళ్లను కంపెనీలోకి అడుగుపెట్టకుండా మీరు ఇబ్బందులకు గురి చేసేందుకు దొంగ కేసులు వేశారా.? లేదా.?
  16. కోట్ల విలువ చేసే కంపెనీ లోగోని రూ.99,000లకే  మీరు ప్రమోట్‌ చేసుకున్న మోజో టీవీకి బదిలీ చేసినట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారా.? లేదా.?
  17. అక్టోబర్‌ 2018లో మీ సంతకంతోనే డైరెక్టర్లను నియమించి వారికి తెలుపకుండా దొంగచాటుగా 30/12/2018న లోగోని అమ్మినట్లు పత్రాలు సృష్టించడం ధర్మం అవుతుందా.?
  18. మీ తప్పుడు చర్యలతో కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా వందలాది మంది ఉద్యోగుల జీవితాలను మీ స్వార్థానికి బలిచేయడం ధర్మయుద్ధం అవుతుందా.?
  19. మొన్న ఈ మధ్య వచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ, రవిప్రకాశ్‌ నాకు మా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని చెప్పాడు కదా. అలా అయితే ఆయన వేసిన కేసు డ్రామానా.? కుట్రనా.?
  20. మీకు శివాజీకి మధ్య ఒప్పందం వివాదమైతే మీపై కేసు వేయాలి కానీ దారినపోయే దానయ్య మీద కేసు వేయించడం ధర్మ యుద్ధమా.?
  21. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని సంస్థ యజమానిని, తోటి ఉద్యోగులను ఇన్నాళ్లు మోసం చేసిన మీరు.. ఇప్పుడు అదే జర్నలిజంపై వ్యాఖ్యలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిది కాదా.?
  22. ఆఖరుగా మీది ధర్మయుద్ధమైతే పోలీసులు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏంటి.? చాటుమాటుగా బెయిల్‌ పిటీషన్లు దాఖలు చేయడం ఎందుకు.?
  23. టీవీ-9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు?

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos