ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారతీయుల చూపు కెనడా వైపు

ముంబయి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలసీల కారణంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారిలో కెనడా, బ్రిటన్‌ల పట్ల పాపులారిటీ బాగా పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. భారతీయులు సహా విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లాలనుకునే వారు కెనడా, బ్రిటన్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత ఆ దేశ వలస పాలసీలను, హెచ్‌1-బీ వీసా విధానాలను కఠినం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది వేరే దేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నారు.

కెనడా సులువైన వలస‌ విధానాలతో విదేశీయులను ఆహ్వానిస్తుండటం, బ్రిటన్‌ వలసవిధానాల్లోనూ వస్తున్న మార్పుల నేపథ్యంలో విదేశీయులు ఉద్యోగాల కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నారని నివేదిక స్పష్టంచేసింది. భారతీయులకు, లాటిన్‌ దేశాల ప్రజలకు కెనడా ప్రత్యామ్నాయ ఎంపికగా మారిందని పేర్కొంది. టెక్నాలజీ, పరిశోదన, ఆర్థిక రంగాల్లో ఎక్కువ జీతం లభించే ఉద్యోగాల కోసం ఎక్కువగా వెతుకుతున్నారని ఇన్‌డీడ్‌ అనే వెబ్‌సైట్‌ తన నివేదికలో వెల్లడించింది.

అత్యంత నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కంటుంటారని, అయితే ట్రంప్‌ వీసా పాలసీల ప్రభావం అలాంటి వారిపై పడుతోందని తెలిపింది. దీంతో వారు కెనడా, బ్రిటన్‌ దేశాల వైపు చూస్తున్నారని పేర్కొంది. 2017 మధ్య నుంచి ఈ ట్రెండ్‌ ప్రారంభమైందని వెల్లడించింది. హెచ్‌1-బీపై కఠిన నిబంధనలు, వీసా ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం జరిగిన సమయంలో ఉద్యోగార్థులు ఇతర దేశాలపై బాగా ఆసక్తి కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2016 ఆగస్టు నుంచి 2018 జులై మధ్య భారతీయులు అమెరికాలో ఉద్యోగం కోసం వెతకడం 60 శాతం నుంచి 50శాతానికి తగ్గిందని, అదే సమయంలో కెనడాలో 6శాతం నుంచి 13శాతానికి పెరిగిందని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos