హొసూరులో కదం తొక్కిన కార్మికులు

హొసూరు : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా హొసూరులో బుధవారం వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ, సీపీఐ, సీపీఎంతో పాటు వాటి అనుబంధ కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. హొసూరులోని గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రెండు వందల మందికి పైగా కార్మిక సంఘాల కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లాలోని శూలగిరి, డెంకణీకోట తదితర ప్రాంతాలలో ట్రేడ్‌ యూనియన్ల కార్యకర్తలు ఆందోళన నిర్వహించి అరెస్టయ్యారు. హొసూరు సమీపంలోని కర్ణాటక సరిహద్దు పట్టణమైన అత్తిపల్లిలో పలు కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos