ఒంటరి పర్యాటకులకు స్వాగతం..

  • In Tourism
  • September 22, 2019
  • 406 Views
ఒంటరి పర్యాటకులకు స్వాగతం..

ఉద్యోగాలు,వ్యాపారాలు,చదువులతో ప్రతిరోజూ రొటీన్‌లైఫ్‌తో విసుగు చెందిన ప్రతి ఒక్కరూ వీటన్నింటికి రెండు రోజులు బ్రేక్‌ ఇవ్వడానికి ఎక్కడికైనా పర్యటనకు వెళ్లడానికి ఆసక్తి చూపడం అత్యంత సహజం.అందులోనూ హైదరాబాద్‌,బెంగళూరు వంటి మహానగరాల్లో నివసించే నగరవాసులైతే ఎప్పుడెప్పుడు పర్యటనకు వెళదామా అని ఎదురు చూస్తుంటారు.అయితే కొంతమంది కుటుంబాలతో వెళ్లడానికి ఆసక్తి చూపగా మరికొంత మంది స్నేహితులతో వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తారు.ఈ రెండు కాకుండా కొంతమంది ఒంటరిగా పర్యాటక ప్రాంతాలు చుట్టిరావడానికి ఆసక్తి కనబరుస్తారు.అటువంటి ఒంటరి పర్యాటకుల కోసం కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు స్వాగతం పలుకుతున్నాయి.
 మైసూరు:
స్వచ్ఛనగరాల జాబితాలో రెండుసార్లు మొదటిస్థానం కైవసం చేసుకున్న మైసూరు నగరం చారిత్రాత్మక,ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు చిరునామాగా విరాజిల్లుతోంది.నగరంతో పాటు చుట్టుపక్కల ఎన్నో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.మైసూరు ప్యాలెస్‌,చాముండిహిల్స్‌,జంతు ప్రదర్శన శాల,కేఆర్‌ఎస్‌ జలాశయం తదితర ప్రదేశాలు చూడదగ్గ ప్రదేశాలు..

మైసూరు..

గోకర్ణ:
బెంగళూరు నగరానికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణభూకైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.అగ్నిశిని,గంగావతి రెండు నదుల మధ్య ఉన్న గోకర్ణ ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు సముద్ర తీరాన ఉన్న అందమైన పట్టణం కూడా.ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడడం వల్ల దీనినిగోకర్ణఅన్నారు.బీచ్ కు ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పడమటి కనుమలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

గోకర్ణ సముద్ర తీరంలో లయకారుడు..

కార్వార:
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తరకన్నడ జిల్లా ప్రధాన పట్టణమైన కార్వార ఎన్నో సహజ అందాలకు కూడా ప్రధాన పట్టణంగా వెలుగొందుతోంది.ప్రశాంతమైన వాతావరణంలో విహరించాలనుకునేవారికి ఇది మంచి ప్రదేశం.కాళి నది కార్వార్ ప్రాంతంలోనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.ఈ బీచ్ లో సన్ బేతింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ ఎంతో ఉత్సాహం,ఆహ్లాదం అందిస్తాయి.కొబ్బరి చెట్లు, సరుగుడు చెట్లు ప్రాంతంలో అధికంగా ఉండి పర్యాటకులకు స్వర్గాన్ని తలిపిస్తాయి.స్విమ్మింగ్‌తో పాటు స్నోర్ కెలింగ్, సర్ఫింగ్ డైవింగ్ వంటివి సాహసక్రీడలకు కూడా  కార్వార్ బీచ్ లైన దేవ్ బాగ్, కూడి, కాజు బాగ్‌లు ప్రసిద్ధి చెందాయి..

కార్వార్‌..

బైలకుప్పె:
కూర్గ్‌ సమీపంలోనున్న బైలకుప్పె బౌద్ధులకు అతిపెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా పరిగణించబడుతోంది.ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలు ఉండడంతో దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. బైలకుప్పె నగర్హౌలె నేషనల్పార్కు చూడదగ్గ ప్రధాన ప్రదేశం.పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్వాచింగ్చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.సమీపంలోనే ఉన్న ప్రకృతి అందాలకు చిరునామా అయిన కూర్గ్‌లో కూడా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

బైలకుప్పెలో బంగారు ఆలయం..

సకలేశ్పుర:
మలెనాడు జిల్లాల్లో ఒకటైన హాసన్‌ జిల్లాలో విస్తరించిన ఉన్న పశ్చిమ కనుమల్లో దట్టమైన అడవుల మధ్య ఉన్న అందమైన పట్టణం సకిలేశ్‌పుర.అన్ని రుతువుల్లోనూ చల్లటి వాతావరణం,ఎత్తైన కొండలు,కాఫీ తోటలు,దట్టమైన అడవుల్లో అరుదైన జంతు,వృక్ష సంపదతో పాటు చారిత్రాత్మక,ఇతిహాస కట్టడాలు,అందమైన పర్యాటక ప్రాంతాలకు కూడా సకిలేశ్‌పుర ఆలవాలంగా నిలుస్తోంది.వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకు అద్భుత ప్రదేశం.

ప్రకృతి అందాలతో అలరారుతున్న సకిలేశ్‌పుర..

ఉడుపి:
ఎన్నో ద్వీపాలు,సముద్ర తీరాలు,ప్రకృతి అందాలకు నెలవైన ఉడుపి ఒంటరి పర్యాటకులకు స్వర్గధామం. ఒక వైపున సముద్ర తీర ప్రాంతం ఉండగా మరోవైపున ఎతైన పచ్చటి పర్వత శిఖరాలు ఉన్నాయి. అయితే రెండు ప్రాంతాలు అంటే లోతైన సముద్రం, ఎతైన పర్వత శిఖరాలు ఒకే చోట ఉన్న ప్రాంతం ఉడిపి. ఉడిపికి దగ్గరగా ఉన్న మల్పె బీచ్, సెయింట్ ఐలాండ్, కౌప్, మరవంతే, బీచ్ లు విదేశీయులను సైతం ఆకర్షిస్తున్నాయి. అదే విధంగా పర్వత శిఖరాలు ట్రెక్కర్స్ కు స్వర్గధామం.ఉడుపికి దగ్గరగా ఉన్న పర్వతాలు, జలపాతాలు పర్యావరణ ప్రేమికులకు కనివిందు చేస్తాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కృష్ణ మందిరం ఉడుపి మఠం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి..

ఉడుపి సముద్ర తీరం..

ఉడుపి శ్రీకృష్ణ మఠం..

బదామి:
చారిత్రాత్మకంగా వాటాపి అని పిలుస్తారు. చాళుక్యుల రాజధాని అయిన బదామీలో రెడ్ సాండ్ స్టోన్ ఏకశిలలో చెక్కిన రాక్ ఖట్ గుహలు మరియు దేవాలయాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. పట్టనంలో ప్రతి మూలలో ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సైట్ ప్రాంతంలోని అనేక త్రవ్వకాల ద్వారా పురాతన కాలం నాటి సంపదను వెలికితీస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

బాదామి..

హంపి:
విజయనగర రాజుల పాలనలో తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడ్డ హంపి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ శోభాయమానమే.హంపి అంటే గుర్తుకు వచ్చేది అక్కడి రాతి శిల్పాలు.శిల్పకళా నిపుణులు చెక్కిర రాతి శిల్పాలు
భారత శిల్పకళకు నిదర్శనం.రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి చారిత్రాత్మక నగరం ఎప్పుడూ ఎర్ర తివాచిని పరుస్తూ ఉంటుంది.ఎన్నో వింతలు,విశిష్టలతో అలరారుతున్న హంపిని అంతర్జాతీయ సంస్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. విఠల దేవాలయం వద్ద ఉన్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న రాతి రథం విజయనగర రాజుల సాంప్రదాయాలను తెలియజేస్తుంది.అంతటి ప్రాముఖ్యత ఉండడం వల్లే ఈ రథాన్ని కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది.

హంపి..

చిక్కమగళూరు:
కర్ణాటక రాష్ట్రంలోనే ఇంకా చెప్పాలంటే దేశంలోనే అత్యధిక పర్యాటక ప్రాంతాలకు నెలవు చిక్కమగళూరు జిల్లా.
అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు,దట్టమైన అడవుల్లో వందల అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులకు కనువిందు చేస్తాయి.వర్షాకాలం,శీతాకాలంలో అయితే చిక్కమగళూరు అందాలకు మైమరచిపోని మనిషే ఉండడంటే ఆశ్చర్యమేమి కాదు.ప్రశాంతమైన  ప్రకృతి పరిసరాలతో నీలం కొండలు.పచ్చని లోయల ప్రకృతి అందాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు ప్రకృతి అందాల మధ్య ఉన్న శృంగేరి శారదాపీఠం,ఇనామ్ దత్తాత్రేయ పీఠం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు సైతం చిక్కమగళూరుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి..

చిక్కమగళూరు..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos