నేటికీ చెక్కుచెదరని అద్భుతం గండికోట..

నేటికీ చెక్కుచెదరని అద్భుతం గండికోట..

ఎన్నో చారిత్రాత్మక,ఐతిహాసిక ఘట్టాలతో పాటు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం వేదికగా నిలిచింది. తిరుమల, శ్రీశైలం,కాణిపాకం,అహోబిళం,మహానంది,యాగంటి,లేపాక్షి ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలకు కేంద్రమైన నాలుగు జిల్లాలు ఎన్నో స్వాతంత్య్ర పోరాటాలు,మరెన్నో రాజసం ఉట్టిపడే కోటలు,చారిత్రాత్మక కట్టడాలకు నిలయాలుగా విరాజిల్లుతున్నాయి.అందులో ఒకటి కడప జిల్లాలోని గండికోట.చాలా కాలంగా ఎవరికీ పెద్దగా తెలియని గండికోట కొద్ది సంవత్సరాలుగా గుర్తింపునకు నోచుకుంటోంది.పెన్నా నది ఒడ్డున సాంకేతిక పరిజ్జానం అంతగా అందుబాటులో లేని సమయంలోనే పునాదులే లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణశైలి ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే.

గండికోట


అంతే కాకుండా ఈ కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ఆ కొండల నడుమన ఉన్న పెన్నానది ప్రకతి ఆరాధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.కొద్ది కాలంగా ప్రభుత్వంతో పాటు పలు తెలుగు,తమిళ చిత్రాలు సైతం గండికోటలో చిత్రీకరణ జరుపుకొంటుండడంతో గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది.ఎర్రటి వర్ణంతో ఉన్నపర్వత పంక్తుల మధ్య ప్రవహించే పెన్నానది ఒడ్డున ఈ రాజ్యం ఏర్పాటు కావడం వల్ల దీనిని గండి కోట అని పిలుస్తారు. పర్వతాల నడుమ నది 300 మీటర్ల వెడల్పుతో మేర ప్రవహిస్తూ ఉంటుంది.వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది.

గండికోటలో బంగారు వర్ణ సూర్యస్తమయం


గట్టుపై యువతి సెల్ఫీ


కొండల మధ్య పెన్నా పరవళ్లు


కొండల మధ్య పెన్నా పరవళ్లు..


కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి.కొండరాళ్లపై పునాదులు లేకుండా నిర్మించిన గండికోట అనేక రహస్యాలు,అద్భుతాలు దాగి ఉన్నాయి.శత్రువుల అంత సులభంగా పైకి చేరుకోకుండా ఉండడానికి కోట ప్రాకారాన్ని ఎర్రటి నునుపైన శాణపు రాళ్లతో 13 మీటర్ల ఎత్తతో నిర్మించారు.అంతేకాకుండా కోట తలుపులపై ఇనుప సూది మేకులు ఏర్పాటు చేశారు.గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు.నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.మధ్య నది, చుట్టూ కొండల మధ్య నిర్మింతమైన ఈ రాజ్యం శత్రుదుర్బేద్యంగా ఉండేది. అందువల్లే ఈ గండి కోట పై అప్పట్లో దండయాత్ర చేయాడానికి ఎవరూ సాహసించేవారు కాదు.

గండికోటలో మండపం.


క్రూరాతి క్రూరంగా శిక్షలు..
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ద తంత్రాలకు నిలయంగా చెబుతారు. ఇక కోట నిర్మాణం సమయంలో స్థలం ఎంపిక అప్పటి పాలకుల ముందుచూపునకు నిదర్శనమని చరిత్ర కారులు చెబుతున్నారు.ఎలాంటి నేరాలకైనా కృరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారని ఆధారాల ద్వారా తెలుస్తోంది.అందుకే ఈ ప్రాంతంలో దొంగతనాలు చేయాలన్నా శత్రువులు దాడి చేయాలన్నా వెనకుడుగేసేవారని చెబుతారు.
కోట చరిత్ర కూడా రహస్యమే..
గండికోట రహస్య నిర్మాణ విషయంలో ఇప్పటికీ అటు చర్రితకారులు ఇటు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణకు రాలేకపోతున్నారు.గండికోటకు దగ్గర్లో దొరికిన ఒక శాసనంలో అంబదేవ అనే రాజు తన రాజధానిని వల్లూరు నుంచి గండి కోటకు మార్చాడని తెలుస్తోంది. అయితే ఇందుకు బలం చేకూర్చే మరే ఆధారాలు ఇక్కడ లభ్యం కాలేదు.గండి కోటకు సమీపంలోని ఉప్పర పల్లెలో దొరికిన మరో శాసనంలో కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు ఈ గండి కోటకు తన ప్రతినిధిగా రాజరెడ్డిని నియమించనట్లు చెక్కబడి ఉంది.దీంతో గండికోట నిర్మాణంపై సందిగ్ధత కొనసాగుతోంది.ఉదయగిరి మండలానికి వెళ్లాలంటే ఈ గండి కోట మీదుగానే అప్పటి రాజులు వెళ్లేవారని తెలుస్తోంది.ఇక 16వ శాతాబ్దంలో గండికోటను తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనర రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ గండికోటను పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది.విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ గండికోటను కుట్రపన్ని వశం చేసుకున్నట్లు చెబుతారు.
విజయనగర రాజుల వైభవం..
విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్న సమయంలో గండికోట చుట్టూ ఎన్నో అద్భత దేవాలయాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.అందులో రంగనాథ ఆలయం,మాధవరాయ ఆలయాలు ప్రధాన ఆలయాలు.ఇక్కడ లభించిన శాసనాల ద్వారా రంగనాథ ఆలయం క్రీ.శ 1479వ సంవత్సరంలో విజయనగర రాజుల హాయంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ప్రస్తుతం ఈ దేవాలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.అయితే గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ దేవాలయాల సంరక్షణపై కూడా దృష్టి సారించింది.

రంగనాథ స్వామి దేవాలయం..


మాధవరాయ స్వామి దేవాలయం..


మాధవరాయ స్వామి దేవాలయం..


పర్యాటకంగా..
చుట్టూ ఎర్రటి కొండలు,లోయలు,పచ్చదనం మధ్యలో గలగల పారుతున్న పెన్నానది పరవళ్లతో గండికోట ప్రకృతి రమణీయతతో ఉట్టిపడుతూ ఆహ్లాదాన్ని పంచుతుంది. దీంతో గండికోటను చూడడానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.దీంతోపాటు గండికోట ట్రెక్కింగ్‌కు సైతం అనువైన ప్రదేశం కావడంతో ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే సాహసీకులు సైతం ఇక్కడికి తరలి వస్తుంటారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఎన్నో కోట్లు ఖర్చుపెడుతోంది.సహజసిద్ధంగా ఏర్పడ్డ గండికోట లోయను భారతదేశపు గ్రాండ్ కెనాన్‌గా ఖ్యాతి గడించింది.
గండికోటతో పాటు సిద్ధవటం కోట,లంకమల అభయారణ్యం,నిత్యపూజకోన తదితర అనేక పర్యాటక ప్రాంతాలకు కడప జిల్లా చిరునామాగా విరాజిల్లుతోంది..

సాహస క్రీడలో యువతి..


సాహసీకుడి రాక్‌ క్లైంబింగ్‌


తాజా సమాచారం

Latest Posts

Featured Videos