ఈసారి భగ భగే

ఈసారి భగ భగే

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుంటుందని అంచనా వేసిందని, ఫలితంగా మరింత వేడిమి పెరుగుతుందని పేర్కొంది. సాధారణంగా ఊహించిన దానికన్నా ఈశాన్య భారతంలో, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్నాటక ప్రాంతాల్లో, మహారాష్ట్ర, ఒడిశాల్లో పలుచోట్ల మరింత ఉధృతంగా వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. మార్చిలో సాధారణం కన్నా అధికంగా (సుదీర్ఘ కాల సగటు 29.9 మిలీమీటర్ల కన్నా 117శాతం ఎక్కువ) వర్షపాతం వుండవచ్చని పేర్కొంది. మార్చి నుంచి మే మధ్య కాలంలో దేశంలో అధిక ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్టంగా, కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా వుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్రో ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. ఉత్తర, మధ్య భారతంలో మార్చి మాసంలో వడగాడ్పుల పరిస్థితులు వుండవని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎల్నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగుతాయని, ఆ తర్వాత తటస్థ పరిస్థితులు వృద్ధి చెందే అవకాశం వుందని అన్నారు. ఆ తర్వాత వర్షాకాలం సీజన్లో రెండో అర్ధభాగంలో లా నినా పరిస్థితులు నెలకొనే అవకాశం వుందని, దీనివల్ల దేశంలో మంచి వర్షాలు పడవచ్చని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos