టీ-కాంగ్రెస్ ఏం చేస్తోంది?

టీ-కాంగ్రెస్ ఏం చేస్తోంది?

తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ నామినేషన్ల పర్వం ఇప్పటికే పూర్తయింది. రెండో దశ నామినేషన్లకు తెరలేచింది. గ్రామాల్లో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విజయం సాధించి ఊపు మీదున్న అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలకు కూడా సీరియస్ గా తీసుకుంటోంది. అత్యధిక సంఖ్యలో సర్పంచులను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రంపై తిరుగులేని పట్టు సాధించాలని.. ఆపై లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చునని భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.కాంగ్రెస్ పరిస్థితి మాత్రం టీఆర్ ఎస్ కు పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు. ఆ పరాజయానికి కారణాలు వెతికే పనిలోనే ఇప్పటికీ ఉంది. నిజానికి కాంగ్రెస్ వెతుకుతోంది కారణాలు కాదు.. సాకులు. ఎన్నికల్లో తమ పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని చెప్తుండటమే వారు సాకులకు నిదర్శనం.అయితే – పాత పరాభవానికి కారణాలు వెతికే పనిలో ఉండి కొత్త విజయానికి కాంగ్రెస్ దూరమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. గ్రామ – మండల స్థాయి నేతలను పిలిపించుకొని మాట్లాడటం విజయానికి వ్యూహరచన చేయడం వంటి పనులేవీ ఆ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం లేదు.కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అలసత్వం పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీ ఘోర పరాభవానికి దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థుల విజయం ఈ ఎన్నికల్లోనూ నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి కారణాలు వెతుకుతూ పంచాయతీ ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలు వచ్చాక పంచాయతీ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు ఏంటా అని విశ్లేషిస్తూ కూర్చోవాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు కళ్లు తెరిచి గ్రామాల్లోకి వెళ్లాలని.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నూరిపోసి పంచాయతీ స్థానాలను ఎక్కువగా దక్కించుకోవడంపై దృష్టిపెట్టాలని హితవు పలుకుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos