కొత్త విద్యార్థి విభాగం ప్రారంభించిన తేజ్ ప్రతాప్

కొత్త విద్యార్థి విభాగం ప్రారంభించిన తేజ్ ప్రతాప్

పాట్నా: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా ఛాత్ర జనశక్తి పరిషత్ అనే విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఛాత్ర ఆర్జేడీ – విద్యార్థి విభాగానికి పోటీ సంస్థ అనే అభిప్రాయం తలెత్తింది. దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని తేజ్ ప్రతాప్, ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. పార్టీని కింది నుంచి గ్రామ స్థాయి వరకూ పటిష్టం చేసేందుకు, రాష్ట్రంలోని యువతతో పాటు రాష్ట్రం వెలుపల ఉన్న యువతను కూడా సమీకరించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తేజ్ ప్రతాప్ వివరించారు. తేజ్ ప్రతాప్ సన్నిహితుడైన ఆకాష్ యాదవ్ను ఛాత్ర ఆర్జేడీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని గత నెలలో ఆర్జేడీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జగన్నాథ్ సింగ్ నిర్ణయించటంతో అలిగిన ఆకాష్ ఇటీవల ఎల్జీపీలో చేరారు. జగన్నాథ్ సింగ్కు, తేజ్ ప్రతాప్కు మధ్య సంబంధాలూ తెగాయి. గతంలో సింగ్ పదవి వదులుకునేందుకు సిద్ధపడి, ఆర్జేడీ కార్యాలయానికి వెళ్లడం మానే శారు. దీంతో లాలూ ప్రసాద్, ఆయన చిన్న కుమారుడు, అసెంబ్లీలో ఆర్జేడీ విపక్ష నేత తేజస్వి యాదవ్ ఎలాగో ఒప్పించి ఆయనను పదవిలో కొనసాగేలా చేశారు. పార్టీ క్రమ శిక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని గత వారంలో తేజ్ ప్రతాప్కు తేజస్వి స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ‘ఛాత్ర జనశక్తి పరషత్’ ఏర్పాటు చేస్తున్నట్టు తేజ్ ప్రతాప్ ప్రకటించారు. దీనికి ప్రశాంత్ రాయ్ అధ్యక్షుడుగా, ఆర్యన్ రాయ్ ఉపాధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించారు. తన తండ్రి ఆశీస్సులు కూడా తాను తీసుకున్నానని, జనశక్తి పరిషత్ ఆర్జేడీకి అనుబంధంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ చర్యకు రాజకీయ ఉద్దేశాలను ఆపాదించరాదని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ అన్నారు. తేజ్ ప్రతాప్ ఇప్పటికే ఆర్జేడీ అనుబంధ సంస్థ ధర్మనిరపేక్ష సేవక్ సంఘటన్కు సారథ్యం వహిస్తున్నారు. అదే విధంగా ఆయన కొత్త రాజకీయ నిర్ణయమూ పార్టీ పటిష్టతకే కృషి చేస్తుందన్నారు. ఛాత్ర ఆర్జేడీకి ఎలాంటి ముప్పూలేదని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos