ఆఫీసులకు రాం..రాం

  • In Money
  • September 23, 2021
  • 74 Views
ఆఫీసులకు రాం..రాం

కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌కు శ్రీకారం చుట్టాయి. వ్యాక్సినేషన్‌ తొలి దశ దాదాపు పూర్తి కావస్తుండడం, కరోనా భయం కాస్త తగ్గడంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రమ్మంటున్నాయి. అయితే ఎక్కువ మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదు. ఒత్తిడి చేస్తే, ఉద్యోగాలను వదులుకుంటామని తెగేసి చెబుతుండడంతో కంపెనీలకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. మరో వైపు సిబ్బందని తమ వైపు ఆకర్షించడానికి, పలు కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఆఫర్లు ఇస్తుండడంతో, ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేస్తున్న కంపెనీలు డోలాయమానంలో పడ్డాయి.

పలువురు ఉద్యోగులు శాశ్వతమైన వర్క్‌ఫ్రం హోం పట్ల ఆసక్తి చూపుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. లండన్‌కు చెందిన ప్రైజ్‌ వాటర్‌ హైజ్‌ కూపర్స్‌ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్‌ఫ్రం హోంలో ఉన్నా 41శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయడానికి అంగీకరించలేదని ఈ నివేదికలో తేలింది. జనవరిలో ఈ కంపెనీ నిర్వహించిన సర్వేలో 29 శాతం మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.

డిసెంబరు దాకా వేచి చూసి…

భారత్‌కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ కంపెనీ ఆగస్టు రెండో వారంలో లక్షన్నర మంది ఉద్యోగుల అభిప్రాయాలతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్‌ఫ్రం హోంకి మొగ్గుచూపారు. ఒత్తిడిలో ఉన్నా తాము రిమోట్‌ వర్క్‌తో అన్నివిధాలుగా సౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తే కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉండాలి. ఈ క్రమంలో నిర్వహణ భారం పెరగడం సహా ప్రధానంగా ఆఫీస్‌ స్పేస్‌ సమస్యగామారే అవకాశాలున్నాయి. అందుకే అక్టోబర్‌ వరకు వేచి చూసి నవంబర్‌ లేదా డిసెంబర్‌ నుంచి ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. చిన్న కంపెనీలైతే ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నాయి.

40 శాతం ఉద్యోగులు సొంతూర్ల నుంచే…

ఇంటి నుంచి పనిచేస్తున్నవాళ్లు చాలా మంది సొంత ఊళ్లల్లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగులు 40 శాతం మంది నగరానికి దూరంగానే ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి అద్దె ఇళ్లు వెతుక్కోవడానికి, వసతి గృహాల్లో చేరడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం కార్యాలయాలకు 10 శాతం మంది ఉద్యోగులు వస్తున్నారు. కంపెనీలు వర్క్‌ ఎట్‌ ఆఫీసుపై ఒత్తిడి తీసుకువస్తే అనుభవం ఉన్న ఉద్యోగులు వేరే కంపెనీకి మారిపోతున్నారు.

ఫలితంగా ఐటీ సంస్థలో అట్రిషన్‌ రేటు పెరుగుతుంది. ఒక సంస్థ నుంచి ఎంత మంది ఉద్యోగులు వెళ్లిపోతున్నారన్న అంశం అధారంగా ఈ అట్రిషన్‌ రేటు నిర్ణయిస్తారు. కొత్త ప్రాజెక్టులు వచ్చే క్రమంలో మానవవనరులు సరిపోని కారణంగా పలు సంస్థలు వాటిని వదిలేస్తున్నాయి. ఓ కంపెనీని వీడిన ఉద్యోగికి వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పిస్తామంటూ తమవైపు లాగేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఈ సవాళ్లను అధిగమిచేందుకు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా నడిచే మైక్రోసాఫ్ట్, అమెజాన్‌, గూగుల్‌ సంస్థలకు డెల్టా వేరియంట్‌ గుబులు పట్టుకుంది. అందుకే జనవరి వరకు వర్క్‌ఫ్రం హోం కొనసాగించవచ్చని ఉద్యోగులకు కబురు పంపాయి. ఏదేమైనా పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడం యాజమాన్యాలకు సవాల్‌గానే మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos