టాటా చేతికి ఎయిరిండియా

టాటా చేతికి ఎయిరిండియా

న్యూఢిల్లీ : ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ ఎఐఎహెచ్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ ‘‘మహారాజా’ను ఇక పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
గురువారం ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూపునకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూపుతో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది.
అంతకుముందు టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎయిరిండియా 101 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నట్లు 2020నాటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos