టన్నుకు పోతున్న తంబీలు..!

  • In Local
  • January 10, 2019
  • 214 Views
టన్నుకు పోతున్న తంబీలు..!

మదనపల్లె : తమిళనాడు వాసుల కొనుగోలు ప్రభావంతో మదనపల్లెలో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన సరకు బుధవారం కిలో రూ.40 వరకు పలికింది. ఇది సంక్రాంతి ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతిని తమిళనాడులో ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. అక్కడి వంటకాల్లో టమోటా వినియోగం ఎక్కువ. మదనపల్లె, వి.కోట, శాంతిపురం, పలమనేరు మార్కెట్లకు రైతులు తీసుకొస్తున్న టమోటాలో తమిళనాడుకే అధిక శాతం సరకు వెళ్తుంది. మదనపల్లెలో 30 లోడ్ల వరకు ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పంట దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌కు టమోటా తగ్గుముఖం పట్టింది. గత రెండు నెలలుగా కిలో ధర రూ.2 నుంచి అత్యధికంగా రూ.6 లోపే పలికింది. మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు రెండు వారాలుగా కోయకుండా వదిలేశారు. కోతపెట్టకపోవడంతో ప్రస్తుత చలి వాతావరణానికి మొక్కలకు బూడిద తెగులు సోకింది.

గతేడాది కంటే తమిళనాడులో పెరిగిన వాడకం
గతేడాది ఇదే నెలలో కిలో టమోటా సగటున రూ.3 నుంచి అత్యధికంగా రూ.6 వరకే పలికింది.ప్రస్తుతం సగటున ధర కిలో రూ.12 వరకు పలుకుతుంది. అప్పట్లో దిగుబడి ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌కు 400 టన్నుల మేరకు రైతులు తీసుకొచ్చారు. దీని కారణంగా 10 కేజీల క్రేట్‌ సగటున ధర కేవలం రూ.40 నుంచి అత్యధికంగా రూ.60 వరకు మాత్రమే పలికింది.ప్రస్తుతం మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుంచి కేవలం 200 టన్నులకు మించి టమోటాను రైతులు మార్కెట్‌కు తీసుకురావడం లేదు. దీంతో ఈ కారణంగా ప్రస్తుతం 10 కేజీల క్రేట్‌ ధర రూ.100 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. ధరలు కూడా సంక్రాంతి పండుగ వరకే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మదనపల్లె నుంచి తమిళనాడులోని పుదుచ్చేరి, తిరుచ్చి, కుంభకోణం, మదురై, చెనై పట్టణాలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos