ఏపీలో హోరాహోరీనట….

ఏపీలో హోరాహోరీనట….

బెంగళూరు : ఎన్నికలు వచ్చాయంటే రకరకాల సర్వేలు బయటకు వస్తుంటాయి. వీటిలో ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవరికీ అర్థం కాకుండా…అసలీ సర్వేలనే పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు జనం. ఏపీ ఎన్నికల్లో జనం నాడిపై తాజాగా ఓ తెలుగు వెబ్‌సైట్‌ ఈ నెల 2, 8 తేదీల మధ్య ఆన్‌లైన్‌ పోల్‌ను నిర్వహించింది. ఓ ప్రశ్నావళిని తయారు చేసి నెటిజెన్ల ముందుంచింది. దానికి లభించిన సమాధానాల ఆధారంగా తేలిన విషయమేమంటే….

ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీల మధ్య పోటీ
హోరాహోరీగా ఉంటుంది. ఇరు పార్టీలకు 40 శాతం చొప్పున నెటిజెన్ల మద్దతు లభించింది. ఎన్నికలు
దగ్గర పడే సమయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో
ఆ పార్టీకి బాగా లాభించనుంది. చంద్రబాబు అయిదేళ్ల పాలన ఎలాగుంది అనే ప్రశ్నకు చాలా
బాగుంది, బాగుంది, ఫర్వాలేదు …అని 52.7 శాతం మంది చెప్పారు. 47.3 శాతం మంది ఆయన పాలన
పట్ల పెదవి విరిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు
అనే ప్రశ్నకు 40.84 శాతం మంది జగన్‌కు, 40.22 శాతం మంది చంద్రబాబుకు ఓటేశారు. పవన్‌
కళ్యాణ్‌ సీఎం కావాలనుకుంటున్న వారు 16 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన ఎన్నికల అనంతరం
పవన్‌ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ విఫలమైందని
54.2 శాతం మంది చెప్పారు. ఏపీని ప్రగతి పథాన నిలపడంలో బాబు విజయం సాధించారని 49.6 శాతం
మంది చెప్పారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, పెన్షన్లు, నిరుద్యోగ భృతి పెంపు లాంటి పథకాల వల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూరుతుందని 44.4 శాతం మంది అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్‌తో
పొత్తు టీడీపీకి లాభిస్తుందని కేవలం 15.1 శాతం మంది మాత్రమే చెప్పారు. 66.8 శాతం మంది
పెదవి విరిచారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ పరోక్ష స్నేహం వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతుందని
40.5 శాతం మంది, ఎలాంటి నష్టమూ ఉండబోదని 41.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రత్యేక
హోదా విషయంలో చంద్రబాబు వైఖరి సరికాదని 55.1 శాతం మంది చెప్పారు.

కొసమెరుపు….ఇవి కేవలం కంటి తుడుపు అభిప్రాయాలు మాత్రమే. ఈ
నెటిజెన్లంతా ఏపీలో ఓటు వేసేవారు కాదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారి అభిప్రాయం
మాత్రమే ఇది…అని ఆ వెబ్‌సైట్ సెలవిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos