నాన్నకు వారసులు

నాన్నకు వారసులు

దీపక్, రాజు అని  పేర్లు మార్చుకుని,  మగవాళ్లలా  హెయిర్‌ కట్‌ చేసుకుని, ప్యాంటు షర్ట్‌ వేసుకుని జ్యోతి, నేహ చేస్తున్న జీవిత పోరాటం  అసాధారణం  మాత్రమే కాదు..  సాహసవంతమైన  జీవన విన్యాసం కూడా!

అమ్మానాన్న, ఇద్దరమ్మాయిలు. ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు మాది’.. అన్నట్లే వాళ్లది ముచ్చటైన కుటుంబం. ఆ ముచ్చట అలాగే కొనసాగితే ఆ ఇద్దరు అమ్మాయిలు అందరు అమ్మాయిల్లాగే ఉండేవాళ్లు.అబ్బాయిలుగా వారే వాళ్లే కాదు. ‘మారడం’ అంటే.. అబ్బాయిలుగా నటించాల్సి రావడం. ఆ నటన కూడా వెండి తెర మీదో, రంగస్థలం మీదో కాదు, నిత్య జీవితంలో! తెర మీద నటిస్తే చప్పట్లు కొడతారు. హర్షిస్తారు. నిజ జీవితంలో నటిస్తే అవేం ఉండవు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. జీవితంలో నటించక తప్పని ఆ ఇద్దరు అమ్మాయిల్ని సమాజం గౌరవించింది. ప్రభుత్వం కూడా వాళ్లను సత్కరించింది. ఆ గౌరవాన్ని, ఆ సత్కారాన్ని అందుకున్న అమ్మాయిలే జ్యోతికుమారి, నేహ.

షాపు తెరిచారు.. వేషం మార్చారు
జ్యోతి కుమారి వయసు 18, నేహకు పదహారేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ నగరానికి దగ్గరగా ఉన్న భన్వారీతోలి వాళ్లుండే గ్రామం. వాళ్ల నాన్న ధృవ నారాయణ. సెలూన్‌ నడిపేవాడు. నాలుగేళ్ల కిందటి వరకు ఆయన సెలూన్‌ నడుపుతూనే ఇంటిని పోషించాడు. పిల్లలిద్దరినీ చదివించాడు. 2014లో ఉన్నట్లుండి అనారోగ్యం పాలయ్యాడు. మంచం మీద నుంచి లేచి సెలూన్‌కు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి.సెలూన్‌ మూతపడింది. అతడు మంచాన పడటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ఇల్లు జరగాలంటే సెలూన్‌ తెరవాలి. తెరిచినా సెలూన్‌లో పని ఎవరు చేయాలి? ఇంట్లో ఒక్క మగపిల్లాడు కూడా లేడు. ధృవ నారాయణ భార్యకు భర్తను చూసుకోవడంతోనే సరిపోతోంది. పైగా సెలూన్‌ అన్నది ఆడపిల్లలు చేసే పని కాదు. మరి.. ఇల్లు గడవాలంటే, ఆ ఇద్దరే ఏదో ఒక పని చేయాలి. వేరే మార్గం లేదు. బాగా ఆలోచించాక ఓ రోజు.. అక్కాచెల్లెళ్లిద్దరూ వెళ్లి సెలూన్‌ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. నాన్న పని చేసేటప్పుడు చూసిన అనుభవం తప్ప స్వయంగా చేసిన అనుభవం లేదు. ‘సవ్యంగా చేస్తారా ఈ ఆడపిల్లలు’ అని సెలూన్‌కి వచ్చే మగవాళ్లకు భయం. ‘‘జాగ్రత్తగా చేస్తాం’’ అని బతిమిలాడి వచ్చిన వాళ్లకు హెయిర్‌కటింగ్‌లు, షేవింగ్‌లు చేశారు. ‘ఫర్వాలేదు, పిల్లలకు పని సులువుగానే పట్టుపడింది’ అనుకున్న పెద్దవాళ్లు భరోసాగా వీళ్ల సెలూన్‌కు రావడం మొదలు పెట్టారు. కొత్త వాళ్లు సెలూన్‌ వరకు వచ్చి అమ్మాయిలను చూసి వెనుదిరిగి వెళుతున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటే, ‘ఈ సెలూన్‌లో అయితే అమ్మాయిలు షేవ్‌ చేస్తార్రా’ అని వచ్చే పోకిరీ కుర్రాళ్లతో వాళ్లకు కష్టాలొచ్చిపడ్డాయి. హెయిర్‌ కటింగ్‌ చేసేటప్పుడు, షేవ్‌ చేసేటప్పుడు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసేవాళ్లు. అప్పుడు తీసుకున్నారా అమ్మాయిలు ఓ నిర్ణయం. సెలూన్‌కి వచ్చిన వాళ్ల హెయిర్‌ కట్‌ చేయడం కాదు, ముందు తమ హెయిర్‌ కట్‌ చేసుకోవాలని.  ఒకరికొకరు హెయిర్‌ కట్‌ చేసుకుని, జీన్స్, టీ షర్టులు వేసుకున్నారు. రాజు, దీపక్‌ అని పేర్లు పెట్టుకున్నారు. ఊరికి దూరంగా హైవేకు దగ్గరగా ఉన్న సెలూన్‌ కావడంతో కస్టమర్లలో సొంతూరి వాళ్లకంటే బయటి వాళ్లే ఎక్కువ. అమ్మాయిలే అబ్బాయిలుగా మారారనే వాస్తవం త్వరగానే మరుగున పడిపోయింది. ఊర్లో ఉన్న వంద కుటుంబాల వాళ్లకూ వీళ్లు అబ్బాయిలు కాదు అమ్మాయిలని తెలుసు. ఆ నిజాన్ని పనిగట్టుకుని సెలూన్‌కి వచ్చే వాళ్లకు చెప్పి ఆడపిల్లల పొట్టకొట్టే అనైతికానికి ఎవరూ పాల్పడలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos