తెలుగు అభిమానులు పోరాటాలకు సిద్దం కావాలి

తెలుగు అభిమానులు పోరాటాలకు సిద్దం కావాలి

అనంతపురము:‘ప్రపంచీకరణ మార్కెట్ శక్తుల ప్రభావంతో ప్రాంతీయ భాషల అస్తిత్వం ప్రమాదంలో పడిపోతోంది. ఈ సంక్లిష్ట సందర్భంలో భాషాభిమానులు అంతా ఏకమై పోరాటాలకు సిద్దం కావాల’ని ప్రసిద్ధ రచయిత సింగమనేని నారాయణ పిలుపు నిచ్చారు. అధికార భాషగా తెలుగు అమలు- సంరక్షణ అంశం గురించి తెలుగు భాష, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఇక్కడి జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ప్రాథమికవిద్య మాతృభాష లలోనే సాగటంతో విద్యార్థులు వికాసం చెందుతారు. ఇందుకు భిన్నంగా పాలకులు వ్యవహరించడ మంటే జాతికి ద్రోహమేన’ని వ్యాఖ్యానించారు.‘తెలుగు భాష అధికార భాషగా అమలు కావాలంటే శాసనసభలో పటిష్ఠమైన చట్టం రూపొందాలి. ఇందుకు ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో ముందుకు రావాలని జన సాహితి సంస్థ నాయకులు సూర్యసాగర్ కోరారు. ‘మాతృభాషలను నిర్లక్ష్యం చేసిన ఏ దేశం, జాతి అభివృద్ధి సాధించలేదు. బతుకు తెరువు కోసం పరాయి భాషల పై ఆధారపడినా అమ్మ భాష మరవరాద’ని విశ్రాంత ఆచార్యులు పి.యల్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలుగు భాష అధికారకంగా అమలుకు జిల్లా స్థాయి సంఘం ఉండాలని విశ్రాంత సబ్ కలెక్టర్ గోవింద రాజులు పేర్కొన్నారు. ‘గ్రామీణ జానపద కళారూపాలలో ఇంకా తెలుగు సజీవంగా ఉంది. కళల సంరక్షణ చేయాల’ని ప్రముఖ రచయిత శాంతినారాయణ సూచించారు. ‘తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థ ను మరింత పటిష్ఠం చేసి తక్షణం శాసనసభలో చట్టం చేయాలి. భాషా సంరక్షణ కోసం సాహిత్య, విద్యారంగాల ఆలోచనపరులు ముందుకు రావాల’ని కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి కోరారు. విద్యారంగం కార్పోరేటికరణ మాతృభాషాల పతనానికి నాంది అవుతోందని పి.డి.యస్.యు నాయకులు నరేష్ అన్నారు. ఇంటర్ లో ఇంతకు ముందు ఎప్పుడు చదవని సంస్కృతం ఒక అంశంగా రావడం విచిత్రమని ఎ.ఐ.యస్.యఫ్ నాయకులు మనోజ్ అన్నారు. తెలుగు సంరక్షణ కోసం ఈ సమావేశంలో వక్తలు చేసిన సూచనలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని సమన్వయ కర్త డా.ఉద్దండం చంద్రశేఖర్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos