నిరాడంబర పెళ్లి

నిరాడంబర పెళ్లి

ఆయనో ఐఎఎస్‌ అధికారి. ఈ నెల పదో తేదీన కుమారుడి పెళ్లి. ఆ స్థాయిలో ఉన్నవారు తలచుకుంటే.. హైటెక్కు లెవెల్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుపగలరు. లక్షలు వెచ్చించి విందువినోదాలు ఏర్పాటు చేయగలరు. కానీ, ఆయన అందుకు పూర్తి విరుద్ధం.. చాలా నిరాడంబరంగా ఉంటారు. సాధారణ జీవన విధానాన్నే అనుసరిస్తారు. నాలుగేళ్ల క్రితం కుమార్తె వివాహాన్ని రూ.16 వేలతో జరిపించారు. ఇప్పుడు కుమారుడి పెళ్లిని అదే వరవడిలో జరుపుతున్నారు. ఆయన విఎంఆర్‌డిఎ కమిషనర్‌ పట్నాల బసంత్‌కుమార్‌. ఆ పెళ్లి విశేషాల గురించి, దాని వెనుక ఉన్న సత్సంగ్‌ గురించి తెలుసుకుందాం.. పదండి.. 

ప్రస్తుత రోజుల్లో పెళ్లి అంటే అంబరాన్ని అంటేలా సంబరాలు చేస్తున్నారు. ధనవంతులు, సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు కూడా పెళ్లి సంగతికి వచ్చేసరికి తల తాకట్టు పెట్టయినా ఘనంగా జరుపుకోవటం అనివార్యం అని భావిస్తున్న పరిస్థితి! పెళ్లి అంటే జీవితంలో ఒక్కసారే కదా వస్తుందన్న ఆలోచనతో లక్షల్లో ఖర్చులు పెట్టి, అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ధనవంతులైతే పెళ్లికి కోట్లు కూడా ఖర్చు చేసిన సందర్భాలున్నాయి. అభ్యుదయవాదులు ఇందుకు మినహాయింపు. దండల మార్పిడితోనో, రిజిష్ట్రారు ఆఫీసులో పరస్పర అంగీకారంతో సంతకాలు పెట్టడంతోనో వివాహతంతు సింపుల్‌గా ముగిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి.
విశాఖపట్నం విఎంఆర్‌డిఎ కమిషనర్‌గా పనిచేస్తున్న పట్నాల బసంత్‌కుమార్‌ ఆడంబరాలకు, అట్టహాసపు వివాహాలకు దూరంగా ఉంటారు. ఆయనొక ఐఎఎస్‌ అధికారి అయినప్పటికీ తన కుమారుని వివాహం మొత్తానికి కేవలం రూ.18 వేలనే ఖర్చు చేయబోతున్నారు. పెళ్లి కుమార్తె కుటుంబం నుంచి కూడా మరో రూ.18 వేలు వెచ్చిస్తారు. మొత్తం రూ.36 వేలతో ఈ పెళ్లి జరపాలని నిర్ణయించారు. పెళ్లికి మేళాలు, భోజనాలు, టెంట్లు, మిగతా హడావుడి అంతా ఈ డబ్బుల్లోనే ఖర్చు చేయనున్నారు. గతంలో బసంత్‌కుమార్‌ కుమార్తె వివాహాన్ని కేవలం రూ.16,100తో చేశారు. ఇప్పుడు మరోసారి తన కుమారుడి వివాహాన్ని నిరాడంబరంగా జరుపుతుండడం చర్చనీయాంశమైంది. 
ఎందుకలా?
పట్నాల బసంత్‌కుమార్‌ సొంత జిల్లా విజయనగరం. ఆయన గ్రూప్‌ వన్‌ అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. తరువాత ఐఎఎస్‌ స్థాయి పొందారు. గవర్నర్‌ వద్ద ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. తరువాత అప్పటి వుడా (ఇప్పుడు విఎంఆర్‌డిఎ)కు విసిగా బదిలీపై విశాఖ వచ్చారు. ఆయన తాత తండ్రుల నుంచి రాధాస్వామి సత్సంగలో సభ్యులు. అప్పటి నుంచి క్రమశిక్షణ, నిరాడంబరతను ఆయన అలవర్చుకున్నారు. గ్రూప్‌ వన్‌ అధికారి అయిన తరువాత 1985లో తన పెళ్లిని కూడా ఈ సత్సంగ సమక్షంలోనే కేవలం రూ.2,345ల ఖర్చుతో చేసుకున్నారు. ఆయన భార్య అనిత, పిల్లలు కూడా ఇదే పద్ధతులు అవలంబిస్తున్నారు. సత్సంగలో ఉన్న వారంతా ఆ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా పెళ్లి చేసుకునే నిబంధన సత్సంగలో ఉండటంతో బసంత్‌కుమార్‌ దాన్ని పాటిస్తున్నారు. 
– ఆదాయాన్ని బట్టే పెళ్లి ఖర్చు
సత్సంగలో ఉన్న సభ్యులు వారికి వచ్చిన ఆదాయాన్ని బట్టే పెళ్లి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బసంత్‌కుమార్‌కు వచ్చిన ఆదాయాన్ని బట్టి ఆయన కుమారుడు వివాహాన్ని రూ.18 వేలు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధనలతోనే ఆయన వివాహం చేస్తున్నారు. ఈ రూ.18 వేలతోనే పెళ్లికి వచ్చినవారికి భోజనాలు, వివాహకర్తకు సంభావన, వేదిక అలంకరణ, మైకులు, కుర్చీలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ సత్సంగానికి సంబంధించిన సభ్యులు నివసించే దయాల్‌నగర్‌లో 200 కుటుంబాలున్నాయి. వీరంతా కాలనీలోనే కూరగాయలు, పూలు పండిస్తారు. పెళ్లికి ఐదు రకాల కూరగాయలు, పూలు తక్కువ ధరకే ఇస్తారు. ఇందుకు ఎనిమిది రోజులు ముందు నుంచి పెళ్లికి సంబంధించిన కుటుంబసభ్యులు సత్సంగ వద్ద సేవా కార్యక్రమాలు చేయాలి. ఇది కూడా సత్సంగ నిబంధన. సత్సంగలో చేరాలనుకునే వారు ఆరు నెలల పాటు సత్సంగలో చేయాలి. ఈ ఆరు నెలల కాలంలో ఆ వ్యక్తిని ‘జిజ్ఞాస’ అని పిలుస్తారు. ఆరు నెలలు పూర్తయిన తరువాత సత్సంగిగా అంగీకరిస్తారు. 
ఏటా ఫిబ్రవరి 10న సత్సంగ సభ్యులు ‘బసంత్‌ పంచమి’ని పురస్కరించుకుని నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఆ రోజే ఇంటికి రంగులు వేసుకుని పండగ చేసుకుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 10న బసంత్‌కుమార్‌ తన కుమారుడు అభినవ్‌ మానస్‌ వివాహాన్ని చేయనున్నారు. 
– రూ. 5 విలువ చేసే పెళ్లికార్డు.. 
– రూ. 20తో పెళ్లి భోజనం
బసంత్‌కుమార్‌ తనయుడు అభినవ్‌ మానస్‌ పెళ్లి ఈ నెల 10న జరగనున్న నేపథ్యంలో ఈ నెల 8న విశాఖపట్నం దయాల్‌ నగర్‌ కాలనీలో ‘సత్సంగ్‌’ చేస్తారు. ఈ సత్సంగానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక స్వీటు, హాటు ఉన్న ప్యాకెట్‌ (దాని విలువ రూ.10 ఉంటుంది) ఇస్తారు. ఆ రోజు భోజనాలు ఉండవు. పదో తేదీ ఉదయం 7 గంటలకు అదే కాలనీలో ‘సగాయి’ ఉంటుంది. ఇందులో భాగంగా వచ్చినవారికి చక్రపార స్వీటు (దీని విలువ రూ.5 ఉంటుంది) ఇస్తారు. అప్పుడు కూడా భోజనాలు పెట్టరు. అదే రోజు ఉదయం 8.45 నిమిషాలకు వుడా పార్కులోని హెలీ ప్యాడ్‌ వద్ద వివాహం జరుపుతారు. రాత్రి 7 గంటలకు వుడా చిల్డ్రన్‌ థియేటర్లో రిసెప్షన్‌ ఉంటుంది. దీనికి పెళ్లికొడుకు తరుఫు నుంచి 35 మందిని, పెళ్లి కూతురు తరుఫు నుంచి 65 మందిని ఆహ్వానిస్తారు. ఒక్కొక్కరికి రూ.20 విలువ చేసే భోజనం పెడతారు. ఇందులో బూరె, మసాలావడ, బిర్యానీ, పులిహోర, రెండు కూరలు, పెరుగు ఉంటాయి. ఈ పెళ్లికి బంధువులను పిలిచేందుకు ఉపయోగించిన ఒక్కో ఆహ్వానపత్రికకు రూ.5 వెచ్చించారు.
– వడ్డీలేని రుణాలు.. ఇంటి అద్దె రూ. 5
విశాఖపట్నం దయాల్‌ నగర్‌లో సత్సంగ సభ్యులు 200 కుటుంబాలతో జీవిస్తున్నారు. ఈ కుటుంబాల్లో ఒక ఇంట్లో కూడా టీవీ ఉండదు. సత్సంగానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ సత్సంగ సభ్యులకు వడ్డీలేని రుణాలు ఇస్తుంది. రుణం పొందిన 5 సంవత్సరాల వరకూ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాలకు వడ్డీ కూడా ఉండదు. ఐదేళ్లు పూర్తయ్యాక తీసుకున్న అసలునే కమిటీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున కుటుంబానికి రూ.లక్ష వరకూ రుణాలు మంజూరు చేస్తారు. 1982లో ప్రారంభమైన ఈ కాలనీలో 25 ఎకరాల్లో 200 ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్లలో సత్సంగ సభ్యులకు నివాసం ఉండటానికి నెలకు రూ. 5 అద్దె చెల్లిస్తే సరిపోతుంది. 
దీపావళి రోజు ఈ కాలనీలో మందుగుండు సామగ్రి కాల్చరు. ఒక్కో ఇంట్లో ఒక్కో తినుబండారాన్ని వండి ఒక దగ్గరకు తెస్తారు. అందరూ కలిసి వాటిని భుజిస్తారు. అదే వారి పండగ. పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి పనినీ సత్సంగ సభ్యులు చేపట్టరు. మోటారు వాహనాలు వాడటానికి కూడా ఇష్టపడరు. సాధ్యమైనంతవరకూ నడకకు, సైక్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు.

పెళ్లిరోజు సెలవు లేదు
నా కుమారుడు పెళ్లిరోజు నేను సెలవు పెట్టాల్సినవసరం లేదు. ఎటువంటి మీటింగ్‌ ఉన్నా హాజరవుతాను. సత్సంగానికి సంబంధించిన కమిటీయే పెళ్లి మొత్తం చూసుకుంటుంది. నా కుటుంబం ఒక్క పదినిమిషాలు ఉండి నవ దంపతులను దీవిస్తే సరిపోతుంది. మా తాతతండ్రుల నుంచి మేమంతా సత్సంగ సభ్యులుగానే ఉన్నాం. నేను పాండురంగాపురం నుంచి తెల్లవారుజామున 4 గంటలకు సైకిల్‌పై బయల్దేరి దయాల్‌నగర్‌ వెళ్తాను. అక్కడ సత్సంగ సన్నిధిలో యోగా చేసి, సేవ చేస్తాను. తిరిగి అదే సైకిల్‌పై ఇంటికి వచ్చేస్తాను. ఇలా రోజుకు సుమారు 16 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతాను. నా భార్య కూడా రోజూ సత్సంగలో పాల్గొంటారు. ఆఫీసులో కూడా లిఫ్టు వాడను. మెట్లు ఎక్కే పైకి వెళతాను. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలుగా భావిస్తాను. ఫుడ్‌ కూడా చాలా లిమిట్‌గా తీసుకుంటాను. నాన్‌వెజ్‌ తినను.
– పట్నాల బసంత్‌కుమార్‌, కమిషనర్‌, 
విఎంఆర్‌డిఎ, విశాఖపట్నం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos