ఎడిఎంకెలోకి అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడు

ఎడిఎంకెలోకి అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడు

హోసూరు : అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుడు పురుషోత్తమ రెడ్డిలు అయిదు వందలమందికి పైగా మద్దతుదారులతో బిజెపిని వీడి ఎడిఎంకె పార్టీలో చేరారు. హోసూరు సమీపంలోని ఎన్.బి. అగ్రహారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తండ్రి తనయులు ఎడిఎంకె తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస రెడ్డి, పురుషోత్తమ రెడ్డిలను బాలకృష్ణారెడ్డి ఎడిఎంకె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తన పంచాయతీని మరింతగా అభివృద్ధి చేయాలనే  ఉద్దేశంతో పాలక పక్షమైన ఎడిఎంకెలో చేరానని తెలిపారు. ఎడిఎంకెలో చేరడం తనకు ఆనందంగా ఉందని, మాజీ మంత్రి సహకారంతో అచ్చెట్టిపల్లి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం తనకు లభించిందని ఆయన అన్నారు. మాజీ మంత్రి బాల కృషారెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రాన్ని ఎడపాడి పళనిస్వామి, యు.ఎన్.ఓ పన్నీర్‌ సెల్వంలు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కితాబునిచ్చారు. వచ్చే ఎన్నికలలో కూడా రాష్ట్రంలో ఎడిఎంకె పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి కన్నా రౌడీయిజం పెరుగుతుందని హెచ్చరించారు. మాజీ ముఖ్య మంత్రి, దివంగత నేత జయలలిత హయాంలో ఎందరో రౌడీలు రాష్ట్రాన్ని విడిచి పారిపోయారని గుర్తు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తే పేదలకు ఇక్కట్లు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈపీఎస్, ఓపీఎస్‌ల నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి గాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టిందని ఆయన తెలిపారు. హోసూర్ యూనియన్ అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుడు పురుషోత్తం రెడ్డి పార్టీలోకి రావడం హోసూరు ప్రాంతంలో పార్టీ బలోపేతానికి సంకేతమని బాలకృష్ణా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హోసూర్ యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి, హోసూరు యూనియన్ ఉత్తర, దక్షిణ విభాగాల కార్యదర్శులు హరీష్ రెడ్డి, రవికుమార్, ఎడిఎంకె పార్టీ నాయకుడు అశోక్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాము, జయ ప్రకాష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos