తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోంది..

పలు కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచనల వ్యాఖ్యలు చేశారు.టీవీ9 సంస్థలో నిధుల అక్రమ తరలింపును బయటపెట్టినందుకే తనపై తప్పుడు కేసులు బనాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందంటూ హైకోర్టుకు నివేదించారు.గతంలో టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆరోపిస్తూ కోర్టుకు నివేదించారు.టీవీ9 కొనుగోలు, నిధుల తరలింపుపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తనను తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.రవిప్రకాశ్‌ తరఫున దిల్జీత్‌సింగ్‌ అహ్లూవాలియా వాదనలు వినిపించగా పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు వినిపించారు. తన క్లైంట్‌ను 40 గంటలపాటు ప్రశ్నించారని, ఇంకా వారికి ఏం చెప్పాలని ప్రశ్నించారు రవిప్రకాశ్ తరపు న్యాయవాది దిల్జీత్ సింగ్ అహ్లూవాలియా. పోలీసులకు నచ్చినది చెప్పేవరకు వేధిస్తూనే ఉంటారా అంటూ నిలదీశారు. టీవీ9లో రవిప్రకాశ్‌కు 10 శాతం వాటా ఉందని, 2003 నుంచి సీఈవోగా ఉన్నారని గుర్తు చేశారు. మిగిలిన 90 శాతం వాటాను ఇతరులు కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. ఆ వాటాల కొనుగోలుకు రూ. 500 కోట్లకు రహస్య ఒప్పందం జరిగిందన్నారు.అందులో రూ. 294 కోట్లు నగదుగా ఇచ్చారని, అది హవాలా మార్గంలో తరలించారని ఆరోపించారు. అలాగే ఏవైనా కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ను ఎస్‌హెచ్‌వో నమోదు చేయాల్సి ఉండగా రవిప్రకాశ్‌పై కేసులో స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగడాన్నిబట్టి చూస్తే అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.తన క్లైంట్ రవిప్రకాశ్ కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు రవిప్రకాశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు పోలీసుల తరపు న్యాయవాది హరేన్ రావల్. ఏబీసీఎల్‌లో రవిప్రకాశ్‌ తన వాటా 40,000 షేర్లను శివాజీకి విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని హైకోర్టుకు నివేదించారు.2018 ఫిబ్రవరిలో వాటాలను విక్రయించినట్లు రవిప్రకాశ్‌ చెప్తున్నారని కానీ వాటిని రికార్డుల్లో చూపించడం లేదన్నారు. ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్‌లలో ఈ సొమ్ము గురించి రవిప్రకాశ్‌, శివాజీలిద్దరూ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.కేవలం ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాలు సృష్టించి వాటాల విక్రయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. టీవీ 9 లోగోను, బ్రాండ్‌ పేరును రవిప్రకాశ్‌ అక్రమంగా విక్రయించారని, దీనికి వాటాదారుల అనుమతి లేదని కోర్టుకు తెలిపారు. మీడియా నెక్స్ట్‌కు అక్రమంగా నిధులను మళ్లించారని ఆరోపించారు.రవిప్రకాశ్ తప్పు చేయనప్పుడు పోలీసుల ముందు విచారణకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని నిలదీశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతోనే రవిప్రకాశ్‌ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. విచారణ నిమిత్తం శివాజీకీ నోటీసులు ఇచ్చామని కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదని కోర్టుకు నివేదించారు.ఇలాంటి కేసుల్లో బెయిలు మంజూరు చేయరాదన్నారు. సుప్రీం కోర్టు బెయిలు అభ్యర్థనను తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించగా న్యాయమూర్తి స్పందిస్తూ అలాగని అరెస్ట్‌కూ అనుమతించలేదన్న విషయాన్ని గమనించాలని వ్యాఖ్యానించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos