మున్ముందు భారీగా రుణాల ఎగవేత

  • In Money
  • July 15, 2020
  • 98 Views
మున్ముందు భారీగా రుణాల ఎగవేత

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ తో ఇప్పటికే కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ మరో పెను కష్టాన్ని కళ్లజూడనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల ఎగవేత రికార్డు స్థాయికి పెరగనుందని అంచనా వేసిన ఆయన, మరో ఆరు నెలల్లో మొండి బకాయిలు ఊహించని స్థాయికి చేరుతాయని అన్నారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ ఎన్సీఏఈఆర్ నిర్వహించిన ఓ వెబినార్ లో పాల్గొన్న ఆయన, సాధారణ పరిస్థితుల్లో ఏర్పడే ఆర్థిక మాంద్యాలతో పోలిస్తే, మహమ్మారుల కారణంగా ఏర్పడే ఆర్థిక మాంద్యాలు అసాధారణమైనవని అభివర్ణించారు. ప్రజలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నారని, దేశంలోని ప్రతి ఒక్కరిపైనా కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఎకానమీని ముందుకు నడిపించే అన్ని వర్గాలపైనా ఇది తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ తరుణంలో మాంద్యం నుంచి ఎలా బయటపడాలన్న విషయంపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, “బోల్డ్ డెసిషన్స్, స్ట్రాంగ్ విల్ పవర్” పేరిట వ్యాసం రాస్తూ, పంచుకున్న అభిప్రాయాలపై స్పందించిన రాజన్, ఈ ఆర్టికల్ ను తాను పూర్తిగా చదివానని, ఇది తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించవచ్చన్న విషయాన్ని ఆమె ప్రస్తావించలేదని అన్నారు. ఈ ఆర్టికల్ ను ఆమె ఎప్పుడు రాశారో తనకు తెలియదని, కానీ, వచ్చే ఆరు నెలల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల విలువ గణనీయంగా పెరగనుందని, త్వరలోనే ఈ విషయం బహిర్గతమవుతుందని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos