రుణాల మారటోరియంపై ప్రైవేట్‌ బ్యాంకుల స్పందన

  • In Money
  • April 1, 2020
  • 144 Views
రుణాల మారటోరియంపై ప్రైవేట్‌ బ్యాంకుల స్పందన

ముంబై : కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచించిన నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకులు స్పందించాయి. ఇప్పటికే మారటోరియం అందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) ప్రకటించగా.. తాజాగా ప్రైవేటు బ్యాంకులు సైతం ముందుకొచ్చాయి. మారటోరియం కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాలని పేర్కొన్నాయి. మారటోరియం వద్దనుకునేవాళ్లు బ్యాంకుకు తెలియజేయాలనే (ఆప్ట్-ఔట్) ఐచ్ఛికాన్ని పీఎస్‌బీలు అందించగా.. కావాలనుకునేవాళ్లు తమను సంప్రదించాలనే (ఆప్ట్-ఇన్) ఐచ్ఛికాన్ని ప్రైవేటు బ్యాంకులు ఇచ్చాయి. మారటోరియం అవసరం లేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారమిస్తున్నాయి. ఈఎంఐపై మారటోరియం అవసరం లేనివారు తమను సంప్రదించాల్సిన అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మారటోరియం కావాలనుకునేవాళ్లు ఈమెయిల్ చెయ్యాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ రెండు ఐచ్ఛికాలను తీసుకొచ్చింది. వేతన జీవుల రుణాలపై ఆప్ట్-ఇన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అదే సమయంలో వ్యాపారులకు ఆప్ట్-ఔట్ సదుపాయాన్ని కల్పించింది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో వారి వద్ద చెల్లించాల్సిన మొత్తం ఉండదన్న ఉద్దేశంతో ఈ ఐచ్ఛికాన్ని కల్పించింది. అయితే, కడతామని ముందుకొచ్చే రుణగ్రహీతలు మాత్రం బ్యాంకుకు తెలియజేయాలని సూచించింది. మరో ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ మారటోరియం విధివిధానాలపై పనిచేస్తున్నామని పేర్కొంది. అందుబాటులోకి తీసుకురాగానే ఆ విషయాన్ని ఖాతాదారులకు తెలియజేస్తామని ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos