ప్రేమికులను వేటాడి..వెంటాడి..

కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం సమీపంలోని బౌద్దరామాల వద్ద చోటు చేసుకున్న ప్రేమజంటపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు గురించి పోలీసులకు పలు విస్తుపోయే విషయాలు తెలిసాయి. కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తె గంగమ్మను పొట్లూరు రాజు కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.నెల రోజులుగా అత్తవారి ఇంట్లోనే ఉంటున్న రాజు సమీప అటవీప్రాంతంలో అడవి పందులు,పిట్టలు వేటాడుతుండేవాడు.ఈ క్రమంలో అప్పుడప్పుడు బౌద్ధరామాలకు వచ్చే ప్రేమజంటలపై కూడా గమనించేవాడు.ఈనెల 24వ తేదీన భీమడోలు మండలం అర్జావారిగూడేనికి చెందిన ప్రేమికులైన దౌలూరి నవీన్, ఎంఎం పురం గ్రామానికి చెందిన తెర్రి శ్రీధరణిలు ఇక్కడి బౌద్ధరామాలకు వచ్చారు.ఇది గమనించిన రాజు బలమైన కర్రతో నవీన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం శ్రీధరణిని హత్య చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడా? లేదా? అనే విషయం పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాత నిర్ధారిస్తామని పోలీసులు చెబుతున్నారు. సంఘటనాస్థలాన్ని బట్టి చూస్తే ధరిణిపై అత్యాచారం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు కొట్టిన దెబ్బలకు నవీన్ స్పృహ తప్పాడు. నవీన్ కూడా చనిపోయాడనుకుని రాజు అక్కడి నుంచి పారిపోయాడు.అయితే విచారణలో పొట్లూరు రాజు గురించి పోలీసులకు పలు విస్తుపోయే నిజాలు తెలిసాయి.ఒంటరి అమ్మాయిలు, ప్రేమికులే లక్ష్యంగా చేసుకొని రాజు దాడులు చేసేవాడు.ఒంటరిగా కనిపించినా, జంటగా కనిపించినా అతని వైఖరి మారదు. మొదట దొంగదెబ్బ కొట్టడం, ఆ తరువాత చేతికి అందిన వస్తువుతో దాడి చేయడం అతని నైజం.బాధితుల వద్ద ఉన్న నగలు,నగదు ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం రక్తమోడుతున్న అమ్మాయిలపై అత్యాచారం చేసి తన వికృత వాంఛను తీర్చుకునేవాడు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం జీలకర్రగూడెం సమీపంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద మూడురోజుల కిందట చోటు చేసుకున్న ఘటన కూడా ఇలాంటిదే..

ధరణిని హత్య చేసిన తరువాత రాజు ఆమె ఫోన్‌ తీసుకుని పారిపోయాడు. జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. ధరణి ఫోన్ లో తన సిమ్‌ కార్డును వేసి వినియోగించాడు. అదే అతణ్ని పట్టించింది. మొదట్లో కనిపించకుండా పోయిన సెల్ ఫోన్.. కొన్ని గంటల తరువాత యాక్టివేట్ అయింది. అప్పటికే ధరణి ఫోన్ ను ట్రాకింగ్ లో ఉంచారు పోలీసులు. ఫోన్ వినియోగంలోకి వచ్చిన వెంటనే.. ఈ విషయం పోలీసులకు తెలిసింది. సిగ్నల్ ఆధారంగా, జీ కొత్తపల్లికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నీ అతనే హంతకుడని నిర్ధారించడానికి అనువుగా ఉన్నప్పటికీ.. సరైన సాక్ష్యాధారాల కోసం అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos