హోసూరు ప్రభుత్వాస్పత్రిలో పడకలు కరువు

హోసూరు ప్రభుత్వాస్పత్రిలో పడకలు కరువు

హోసూరు : పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన హోసూరులోని  ప్రభుత్వాస్పత్రిలో పడకలు కరువై గర్భవతులకు నేల మీదే చికిత్సలు అందిస్తున్నారు. హోసూరు ప్రభుత్వాస్పత్రికి రోజుకు వేల మంది చికిత్సకు వచ్చి వెళుతుంటారు. 150కి పైగా పడకలున్న ఈ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో తగిన  వసతులు లేకపోవడంతో గర్భవతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాపలపై పడుకోవాల్సిన దుస్థితి ఆస్పత్రిలో కనిపించింది. మరో పక్క హోసూరు ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రిలో భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులు, డాక్టర్లను కలిసేందుకు వచ్చే గర్భవతులు భౌతిక దూరాన్ని పాటించకుండా  కూర్చోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో రోగులను కలిసేందుకు వచ్చే వారు విచ్చలవిడిగా తిరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా  రోగులకు చెప్పేవారు లేకపోవడంతో అందరూ యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సత్వరమే  చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం లో పడకల సంఖ్యను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos