మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో పోలీసులు..

మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో పోలీసులు..

రాజధాని మార్పు ప్రకటన వెలువడిన రోజు నుంచి అమరావతిలో రైతులు,ప్రజలు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. అమరావతి ప్రజలకు ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలపడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.ఈ నేపథ్యంలో అమరావతిలో పరిస్థితి అదుపు తప్పకుండా భద్రత విధులకు హాజరైన పోలీసులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.గడచిన రెండు వారాలకు పైగా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలు, ధర్నాలను నిర్వహిస్తున్న 29 గ్రామాల ప్రజలు, పోలీసులకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ గ్రామాల్లోకి ప్రవేశించి, తనపైనే జులుం చేస్తున్నారని, ఆడవాళ్లను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులకు తాగునీరు, ఆహారం, మందులను, కాఫీ, టీలను విక్రయించరాదని నిర్ణయించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, లాఠీ చార్జీలకు దిగుతున్నారని ఆరోపించిన ప్రజలు, పోలీసులు తమ ఇళ్ల వద్ద నిలబడటానికి కూడా వీల్లేదని అంటున్నారు. తాగేందుకు వారికి నీళ్లు కూడా ఇవ్వరాదని ప్రజలంతా భీష్మించుకు కూర్చోవడంతో, పోలీసులకు, ముఖ్యంగా మహిళా పోలీసులకు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. తమతో మాట్లాడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని, తమను చూస్తేనే ముఖం తిప్పేసుకుని వెళ్లిపోతున్నారని మహిళా పోలీసులు వాపోయారు. ఇక పోలీసుల నిత్యావసరాలను తీర్చేందుకు విజయవాడ నుంచి ఆహారం, నీళ్లను పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos