హత్య పథకం బట్టబయలు…గాయపడిన నీలిమ మృతి

హత్య పథకం బట్టబయలు…గాయపడిన నీలిమ మృతి

హొసూరు : ఇక్కడికి సమీపంలోని సానమావు  అటవీ ప్రాంతంలో ఈ నెల 11వ తేదీ రాత్రి టిప్పర్‌తో కారును ఢీకొని ఇద్దరిని హత్య చేసిన సంఘటనలో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హొసూరు కు చెందిన ఆనంద్ బాబు, ఆయన భార్య నీలిమ ఇక్కడికి సమీపంలోని నాయనపల్లి వద్ద పేపర్ మిల్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో ఆనంద్ బాబుకు, అతని సమీప బంధువుకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో అతను ఆనందబాబుతో పాటు ఆయన భార్య నీలిమను అంతమొందించడానికి కుట్ర పన్నాడు. అందులో భాగంగా టిప్పర్‌తో కారును ఢీ కొట్టించి హత్య చేయాలనుకున్నాడు. పథకాన్ని అమలు చేయడానికి మధురైకి చెందిన ముఠా 20 రోజులు రెక్కీ నిర్వహించింది. ఈ నెల 11వ తేదీ రాత్రి నీలిమ,  ఆనంద్ బాబు కంపెనీ నుంచి ఇంటికి పయనమయ్యారు. ఇంతలోనే కంపెనీ మేనేజర్‌తో మాట్లాడే పని ఉందని చెప్పి, తన భార్య నీలిమను మాత్రమే ఆనంద్‌ బాబు కారులో పంపించాడు. కారు హొసూరు వైపు వస్తుండగా సానమావు అటవీ ప్రాంతంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. కారు రోడ్డు పక్కన ఆగిపోవడంతో టిప్పర్‌లో ఉన్న హంతకులు పెట్రోల్ బాంబును దానిపై విసిరారు. కారు డ్రైవర్ మురళి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. నీలిమ మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తొలుత దీనిని రోడ్డు ప్రమాదంగా భావించారు. టిప్పర్‌ డ్రైవర్ పరారీ కావడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం ప్రకారం…వ్యాపారంలో పోటీ కారణంగా పక్కా ప్లాన్‌తో ఆనంద్‌ బాబు  దంపతులను హత్య చేయడానికి సమీప బంధువే పథక రచన చేశాడు. ఈ కుట్రలో పాల్గొన్న మధురైకి చెందిన హంతకులను అరెస్టు చేశారు. వారిలో మధురైకి చెందిన లారీ డ్రైవర్ మహారాజ్, లారీ యజమాని నీలమేఘన్, హత్యకు సహకరించిన హొసూరు సమీపంలోని గంగాపురానికి చెందిన ఆనంద్, ఆలూరు దిన్నూర్ గ్రామానికి చెందిన శాంతకుమార్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హత్య కుట్రలో పాల్గొన్న మరో తొమ్మిది మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మంటల్లో చిక్కుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీలిమ గురువారం  రాత్రి మరణించింది. ఈ సంఘటన అందరినీ కలచివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos