బాబుది బురద రాజకీయం

బాబుది బురద రాజకీయం

విజయవాడ :మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అబద్ధాలతో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదల గురించి చంద్రబాబు నాయుడు శుక్రవారం విలేఖరులకు తెలిపిన సమాచారం తప్పుల తడకని ధ్వజ మెత్తారు. శనివారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడారు. ‘చంద్ర బాబు నాయుడు బురద రాజకీయాలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదా? ఆయన చెప్పినట్లు వరద నీటిని వదిలేసి ఉంటే జలాశయాల్లో నీరు నిల్వ ఉండేది కాదు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయల సీమకు నీరు ఎలా ఇస్తాం? ఈ మాత్రం అవగాహన చంద్రబాబుకు లేదా’ని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగం సమన్వయంతోనే వరద నీటిని నిల్వ చేసుకోగలిగామన్నారు. జులై 29నాటికి 419 టీఎంసీలు మూడు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండగా ఆగస్టు 3న శ్రీ శైలానికి వరద వస్తే 6న నాగార్జున సాగర్కు నీటిని వదిలామన్నారు. శ్రీ శైలం జలాశయానికి వచ్చిన 890 టీఎంసీల వరద నీటిని చంద్రబాబు చెప్పినట్లుగానే 580 టీఎంసీలు నింపుకున్నా దాదాపు 300 టీఎంసీలుపైగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరివ్వాలంటే పోతిరెడ్డిపాడు 474 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా 2,500 క్యూసెక్కులు , ఇలా రెండు కలిపితే 3 వేల క్యూసెక్కుల నీరు అవుతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు 20 రోజుల్లో ఆ మొత్తం నీరు తీసుకున్నా కూడా 80 టీఎంసీలు మాత్రమే అవుతాయన్నారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని, ఈ విషయంలో వరద రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos