మోడీ హామీల వెనుక

మోడీ హామీల వెనుక

న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట అనేక హామీలు విన్పిస్తున్నాయి. ఆయన భాషలో చెప్పాలంటే అవి ‘మోడీ గ్యారంటీలు’. ఇటీవల మోడీ ప్రకటించిన ఉచిత రేషన్ పథకం పొడిగింపు అందులో ఒకటి. ప్రస్తుతం దేశంలోని 80 కోట్ల మంది పేదలకు వర్తింపజేస్తున్న పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగిస్తామని తెలిపారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఇంకా ఆకలితో అలమటిస్తున్నారని పరోక్షంగా అంగీకరించడం ద్వారా ఆయన ఆర్థిక వ్యవస్థ బలహీనతను ఒప్పుకున్నారు. ప్రధాని ప్రకటన ఇంకా క్యాబినెట్ ఆమోదం పొందలేదన్నది వేరే విషయం. గత కొన్ని నెలలుగా మోడీ ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రకటించేస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇదంతా చేస్తోందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని కొనసాగిస్తామని అంటున్న మోడీ, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్న రేషన్ను నిలిపివేస్తారా లేక దానికి రేటు వసూలు చేస్తారా అన్నది చెప్పడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1న ప్రారంభించిన ఈ పథకం గడువు డిసెంబర్తో ముగుస్తుంది. ఇప్పుడు దీనిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించారు. ఇదిలావుంటే మోడీ ఇటీవల మరో పథకాన్ని ప్రకటించారు. అదే భారత్ దాల్, భారత్ ఆటా. ఈ పేరుతో ప్రభుత్వం పప్పు, గోధుమ పిండిని ప్రజలకు సబ్సిడీ రేటుకు విక్రయిస్తుంది. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని మోడీ స్పష్టంగా చెబుతారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏమిటి? పప్పులు, గోధుమ పిండి వంటి ఆహార వస్తువుల్ని అమ్మడం వ్యాపారం కాదా? వీటిని కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత పేదలకు ఉంటుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అయినప్పటికీ ప్రభుత్వం ఇదేమీ ఆలోచించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓట్లను రాబట్టేందుకు ఏదో ఒకటి చేయాలి. అంతే… ప్రభుత్వం ఇంతటితో ఆగలేదు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఎల్పీజీ సబ్సిడీని రెండుసార్లు పెంచింది. తొలుత సిలిండర్కు రూ.200 సబ్సిడీ పెంచింది. పీఎం ఉజ్వల యోజన పథకం కింద లబ్ది పొందుతున్న పేద కుటుంబాలే కాకుండా వినియోగ దారులందరికీ దీనిని వర్తింప జేశారు. ఆ తర్వాత అక్టోబరులో పథకం లబ్దిదారులకు మరో వంద రూపాయల సబ్సిడీ పెంచారు. ఎరువుల సబ్సిడీపై అయ్యే వ్యయం పెరుగుతోందని ప్రభుత్వం మేలో ప్రకటించింది. 2023-24 బడ్జెట్ కేటాయింపు కంటే ఈ వ్యయం 30% పెరిగిందని తెలిపింది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఈ పథకానికి అత్యవసరంగా పది వేల కోట్ల రూపాయలు కేటాయించింది. బలహీనంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇదో ఉదాహరణ. మోడీ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు, కార్యక్రమాలు, రాయితీలు ప్రజలకు ఉపయోగపడేవే అయినప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే ప్రజలపై హామీల వరద పారిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos