10 వేల మంది వలస కార్మికులు ఇంటి బాట…

10 వేల మంది వలస కార్మికులు ఇంటి బాట…

హోసూరు : కృష్ణగిరి జిల్లాలో పని చేస్తున్న 10 వేల మంది వలస కార్మికులు సొంత గూటికి చేరుకొన్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, క్వారీలు, ఇటుకల బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికులు లాక్ డౌన్ వల్ల పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కృష్ణగిరి జిల్లాలోని హోసూరు పారిశ్రామికవాడతో పాటు హోసూరు ప్రాంతంలోని ఇటుకల బట్టీలు, పాలీహౌస్‌లలో ఎక్కువమంది వలస కార్మికులు పని చేసేవారు. గత రెండు నెలలుగా కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల పరిశ్రమలే కాక వ్యవసాయ రంగం కూడా దెబ్బతింది. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని సొంత రాష్ట్రాలకు తరలించడానికి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హోసూరు చుట్టు పక్కల ప్రాంతాలలో పని చేస్తున్న వలస కార్మికులే కాకుండా కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న వలస కార్మికులను ప్రత్యేక రైలు ద్వారా సొంత రాష్ట్రాలకు తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అసోం, ఒడిశా తదితర రాష్ట్రాలకు కార్మికులను తరలించారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న మరి కొంత మందిని సొంత ఊళ్లకు తరలించడానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వలస కార్మికులను ప్రత్యేక రైలు ద్వారా తరలించే కార్యక్రమాన్నికృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos