బ్రాకెట్ ఓపెన్…బతుకులు క్లోజ్

బ్రాకెట్ ఓపెన్…బతుకులు క్లోజ్

అనంతపురం జిల్లా తాడిపత్రి కేంద్రంగా గత నాలుగు దశాబ్దాలకు పైగా తిష్ట వేసిన మట్కా జూదం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు మట్కా నిర్వాహకులు, తనిఖీలు చేయడానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులపై దాడి చేసి, పోలీసు జీపును కాల్చి భయానక వాతావరణం సృష్టించారు.

మట్కా మూకలు పారిపోతున్న పోలీసుల్ని కూడా వదలకుండా వెంబడించి రాళ్ళు, కర్రలు, సోడా బాటిల్స్‌తో దాడులకు పాల్పడటం, అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తనిఖీల కోసం వెళ్లిన కడప జిల్లా పోలీసు అధికారులపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మట్కా నిర్వాహకులు రషీద్ అనుచరులు గత నెల 30న తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హమీద్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు పోలీసులపై మట్కా మాఫియా జరిపిన దాడులు ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా పోలీసు శాఖకు సవాలు విసిరాయి.

ఈ సంఘటనపై బీబీసీ చేసిన పరిశీలనలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

నాలుగు దశాబ్దాల క్రితం మట్కా జూదం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, కర్నాటక రాష్టంలోని బళ్లారి ప్రాంతంలో విస్తరించడం మొదలైంది.

మొదట ముంబయి కేంద్రంగా రతన్ లాల్ అనే నిర్వాహకుడు మట్కా వ్యాపారాన్ని ఆరంభించాడు. అతని పేరుతోనే అది రతన్ లాల్ మట్కా‌గా పాపులర్ అయింది. రోజూ ఈ మట్కాలో కోట్లాది రూపాయల జూద౦ యధేచ్ఛగా కొనసాగుతూ వచ్చింది. కొంత కాలానికి కర్నాటక రాష్ట్రం బళ్లారి కేంద్రంగా కల్యాణి మట్కా ఆరంభమై పేదలను, మధ్యతరగతి వర్గాలను బలంగా ఆకట్టుకుంది.

మట్కా జూదానికి బానిసలైన చాలామంది ప్రజలు సర్వస్వం కోల్పోయి బికారులుగా మారి రోడ్డున్న పడ్డ సంఘటనలు కోకొల్లలు. క్రమంగా ప్రభుత్వం మట్కాను రూపుమాపడం కోసం అణచివేత చర్యలు చేపట్టింది. ఫలితంగా, కడప, కర్నూలు జిల్లాల్లో కొంతమేర అది తగ్గుముఖం పట్టినప్పటికీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జోరందుకుంది. క్రమంగా కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలలో మట్కా నిర్వాహకులకు తాడిపత్రి అడ్డాగా మారింది. తాడిపత్రి కేంద్రంలో రోజూ కోటి నుంచి రెండు కోట్ల రూపాయల విలువైన జూదం జరుగుతున్నట్లుగా అనధికారిక అంచనా.
మట్కా అంటే…
మట్కా ఓ విధమైన లాటరీ.

1 నుండి 99 వరకున్న అంకెలను మట్కా నిర్వాహకులు లాటరీలో రోజువారి జూదానికి ఉపయోగిస్తారు. రూపాయి పెడితే 80 రూపాయలు వచ్చేలా లాటరీ ఉంటుంది.

ఓపెన్, క్లోజ్, బ్రాకెట్ నంబర్లపై జూదరులు పందెం కాస్తారు. రోజులో ఏదో ఒక నిర్ణీత సమయంలో మట్కా బీటర్లు ఓపెన్, క్లోజ్, బ్రాకెట్ నంబర్లను ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన నంబర్లతో పందెం కాసిన వారి అంకెలు సరిపోలితే, ముందుగా నిర్ణయించిన డబ్బును పందెం కాసినవారికి అందిస్తారు.

ప్రతి రోజు సుమారు ఆరు గంటలపాటు జరిగే ఈ మట్కాలో తాడిపత్రిలో రోజుకు కోటి నుంచి రెండు కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. గతంలో నేరుగా జరిగిన మట్కా వ్యాపారం, ప్రస్తుతం ముంబయి కేంద్రంగా వాట్సాప్ ద్వారా ఆన్ లైన్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్క రూపాయి పెట్టి కూడా మట్కా ఆడొచ్చు కాబట్టి, ఎక్కువగా పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఈ జూదాన్ని ఆడించడానికి అనంతపురం జిల్లాలో ముఖ్యం గా తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, హిందూపురంలో వందల సంఖ్యలో బీటర్లు పని చేస్తుంటారు. ఈ బీటర్లు గతంలో కాగితాల మీద డబ్బు తీసుకొని కస్టమర్లకు నంబరు వేసిస్తు ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ మట్కా టెక్నాలజీ సహాయంతో వాట్సాప్ ద్వారా జరుగుతోంది.

కాబట్టి, కస్టమర్లు ఎక్కడ ఉన్నా సరే ఒక ఫోను చేసి తాము ఎంత పందెం ఏ నెంబర్ మీద కడుతున్నారనేది బీటర్లకు చెబితే ఆ బీటరు వెంటనే వీరికి ఎస్‌ఎంఎస్ ద్వారా నంబర్ పంపుతారు. ఇలా ఓ కంపెనీ రోజుకు 7 దాకా ఆటలు నిర్వహిస్తుంది.

మధ్యవర్తులు మోసం చేయకుండా, ఈ ఆటలో తాము పందెం కాసిన నంబర్ గెలిచిందో లేదో ఇంటర్నెట్‌లో చూసుకునే వెసులుబాటు కూడా ఉంది.

అందుకే ఒక తాడిపత్రిలోనే రోజూ కోటి రూపాయలు, జిల్లా మొత్తంలో తీసుకుంటే 5 కోట్ల రూపాయల విలువైన మట్కా జూదం జరుగుతుందని అంచనా.

బీటరు, నిర్వాహకులదే హవా !

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎవరు అధికారంలో ఉన్నా మట్కా నిర్వాహకుల జోరు మాత్రం తగ్గలేదు. మట్కా బీటరు రోజువారీ ఆదాయం కనీసం పదివేల రూపాయలకు తగ్గకుండా ఉంటుందని అంచనా. మట్కా నిర్వాహకుల ఆదాయం నిత్యం లక్షల్లోనే ఉంటుందని అంచనా.

చిన్న చిన్న పనులు చేసుకొనే వాళ్లు, రోజుకు 200 నుండి 300 రూపాయలు సంపాదించే కూలీలు చాలామంది ఈ ఆటకు బానిసలుగా మారి వారి సంపాదనలో సగ భాగం ఈ మట్కాలోనే పోగొట్టుకుంటున్నారని జిల్లా ఎస్పీ జి.వి. ఆశోక్ కుమార్ అన్నారు.

‘ఈ మట్కాను గ్యా౦బ్లి౦గ్ యాక్ట్ క్రింద 40 ఏళ్ళ కిందటే రద్దు చేసినప్పటికీ, ఈ ఆటలో ఒక రూపాయికి 80 రూపాయలు వస్తుందనే ఆశతో, అపోహతో ఈజీ మని అనుకొని ముఖ్యంగా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆడుతున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. దీన్ని పూర్తిగా అరికట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. నిర్వాహకులను అరెస్టు చేసినా, టెక్నాలజీ సాయంతో ఎక్కడెక్కడి నుంచో దీన్ని నిర్వహిస్తున్నారు.

చట్టపరంగా మట్కాకు శిక్ష తక్కువగా ఉండడం, కొన్నిసార్లు జరిమానాకు పరిమితమవ్వడంతో నిర్వాహకులు పెద్దగా బెదరట్లేదు’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos