పాకిస్థాన్‌కు మన్మోహన్ సింగ్

పాకిస్థాన్‌కు మన్మోహన్ సింగ్

ఢిల్లీ : గురు నానక్ 550వ జయంతిని పురస్కరించుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌లోని కర్తార్పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌కు వెళ్లనున్నారు. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం ఆహ్వానించడంతో వెళ్లడానికి మన్మోహన్ అంగీకరించారు. నవంబర్ 12న గురునానక్ జయంతి కావడంతో మన్మోహన్ సింగ్ నవంబర్ 9న కర్తార్‌పూర్‌ గురుద్వారాకు తొలి విడత భక్తులతో కలసి వెళ్లాలని నిర్ణయించారు. అనంతరం ఆయన సుల్తాన్‌పూర్‌ లోధికి కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే పాక్ విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఖురేషీ కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్‌ను ఆహ్వానించనున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లో గల గురుదాస్‌పూర్‌ జిల్లాలోని గురునానక్ మందిరాన్ని కర్తార్‌పూర్‌ కారిడార్ కలుపుతోంది. రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్య క్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మత గురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారని ఆ మత పురాణాల ద్వారా తెలిసింది. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రాముఖ్యం ఉంది. అయితే విభజనతో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలవడంతో భారత్‌లోని సిక్కులు ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఇబ్బందులు పడేవారు. ఈ కారిడార్ ప్రారంభమైతే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా నుంచి పాక్ భూభాగంలోని డేరాబాబా నానక్‌కు భారత్ నుంచి యాత్రికులు నేరుగా వీసా లేకుండా వెళ్లి రావచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos