వైకాపాలో చేరిన మల్లికార్జున రెడ్డి

వైకాపాలో చేరిన మల్లికార్జున రెడ్డి

హైదరాబాద్‌: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైకాపా గూటికి చేరారు. ఈనెల 30న అధికారికంగా ఆపార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకున్న మల్లికార్జున రెడ్డి తాజా పరిణామాలపై ఆయనతో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మేడా పార్టీ మారడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో మల్లికార్జునరెడ్డి బదులు ఆయన సోదరుడు రఘునాథరెడ్డి రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మేడా.. కడప జిల్లా నుంచి తెదేపా తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఆమేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ విప్‌ పదవి, ఆయన తండ్రికి తితిదే పాలకమండలి సభ్యత్యం ఇచ్చింది. జగన్‌తో భేటీ అనంతరం మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైకాపాలో చేరినట్టు చెప్పారు. తెదేపాలో నాలుగున్నరేళ్లు ఎన్నోఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణామాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానని, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు చెప్పేది ఒకటి .. చేసేది మరొకటి, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos