మహాభారతం

మహాభారతం

గాంధారీ శాపం

‘అమ్మా! నీ నూరుగురు పుత్రులనూ చంపించింది నేనే! నా మీద జాలిపడకు. నన్ను శపించు. నాకు తగిన శిక్ష విధించు’ అంటూ గాంధారీదేవి కాళ్ళ మీద పడ్డాడు ధర్మరాజు. కాబోయే మహారాజు తన కాళ్ళ మీద పడడంతో ‘తప్ప’న్నట్టుగా వెనక్కి జరిగింది గాంధారీదేవి. ఆ జరగడంలో కళ్ళకు కట్టిన గుడ్డ కొంచెం చెదిరింది. అప్పుడు గాంధారీదేవి చూపు ధర్మరాజు పాదాలపై పడింది. అంతే! ధర్మరాజు పాదాలంటుకున్నాయి. అది చూసి భీమార్జున నకుల సహదేవులు దూరంగా తొలగిపోయారు. కృష్ణుడు ఆందోళన చెంది ధర్మరాజును సమీపించాడు. వెనక్కి లాగాడతన్ని. దగ్గరగా ఉన్న జలపాత్రను అందుకుని, ధర్మరాజు కాళ్ళ మీద నీరు కుమ్మరించాడు. మంటలు ఆరిపోయాయి. తమ్ములంతా దగ్గరకొచ్చారు. కందిన అన్నగారి పాదాలను చూసి ఆశ్చర్యపోయారు. నోట మాట రాలేదెవరికీ. ఇంతలో తన లోలోపలి ఆగ్రహాన్ని నిగ్రహించుకుందేమో గాంధారీదేవి పాండవులతో ఇలా అన్నది.‘‘వెళ్ళి మీ తల్లిని, కుంతీదేవిని కలిసి రండి’’ఆ మాటనడం ఆలస్యం అక్కణ్ణుంచి పరుగులాంటి నడకతో కుంతీదేవిని సమీపించారు పాండవులు. వారక్కడికి చేరుకున్న సమయానికి అటు తిరిగి రోదిస్తోంది కుంతి. కొడుకులు విజయాన్ని సాధించారన్న మాటేగాని, బంధు మిత్రులనూ, పుత్రులనూ ఎంత మందిని కోల్పోయారో కదా! ఎన్ని ఘోరాపదలను ఎదుర్కొన్నారో కదా! పుట్టిన దగ్గర నుంచి పిల్లలకన్నీ కష్టాలేననుకుంటూ కన్నీరు తుడుచుకుంది.‘‘అమ్మా’’ పిలిచారు పాండవులు. ఇటు తిరిగిందామె. పిల్లలను చూసి చేతులు జాచింది. ఒక్కటిగా వచ్చారంతా. తల్లి పాదాలనంటి నమస్కరించారు. అందర్నీ లేవనెత్తి అక్కున చేర్చుకుందామె. ఆప్యాయంగా అందర్నీ నిమిరి పచ్చి పచ్చిగా ఉన్న గాయాలను చూసి మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. అంతలో అక్కడికి ద్రౌపదీదేవి చేరుకుంది. కుంతీదేవితో ఇలా అంది.‘‘ఒక్కడు…ఒక్కడంటే ఒక్క మనవడు కూడా మీకు లేకుండాపోయాడు అత్తయ్యా! అందర్నీ ఆ కౌరవులు పొట్టన పెట్టుకున్నారు’’కుప్పకూలి నేలను చేత్తో రాస్తూ విలపించసాగింది ద్రౌపదీదేవి.‘‘ఊరడిల్లమ్మా! ఊరడిల్లు’’ ద్రౌపదీదేవిని గుండెలకదుముకుంది కుంతి.

అనునయంగా ఆమె నుదుటన ముద్దులు పెట్టింది. దుఃఖాన్ని దిగమింగుకున్నాక కోడలూ, కొడుకుల సహా గాంధారీదేవిని దర్శించింది కుంతీదేవి. వస్తూనే గాంధారీదేవి పాదాల మీద పడి కుమిలి కుమిలి ఏడవసాగింది ద్రౌపది. ఆమెను లేవనెత్తి దగ్గరగా తీసుకుంది గాంధారి. ఇలా అన్నదామెతో.‘‘ఏడవకమ్మా ఏడవకు! ఊరుకో! ఇప్పుడేడ్చి ప్రయోజనం లేదు. నిన్ను నేనూ, నన్ను నువ్వూ ఓదార్చుకోవడం తప్ప చేసేదేమీ లేదు. విధి రాతను మార్చలేం. ఇలా జరుగుతుందని ధర్మవేత్త విదురుడు చెప్పనే చెప్పాడు. విన్నాం కాదు. వినని పాపానికి ఇప్పుడేడుస్తున్నాం. దుఃఖంతో అందర్నీ ఆడిపోసుకుంటున్నానుగాని, నిజానికి నా కొడుకుల దుస్సంకల్పాన్ని నేను అడ్డుకోగలిగానా? లేదు! అంతా జరగాల్సి ఉంది. జరిగింది. అంతే’’ద్రౌపదీదేవి కన్నీళ్ళు తుడుచింది గాంధారీదేవి. అంతలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. గాంధారీదేవికి దివ్యదృష్టి ప్రసాదించాడు. ఆ దృష్టి గాంధారీదేవి వ్రతనిష్ఠకు భంగం కలిగించలేదు. పైగా సుదూర యుద్ధభూమి సమీపాన నిలచినట్టనిపించింది. అన్నీ ఆమెకు కనిపించసాగాయి.తుత్తునియలయిన శ్వేతచ్ఛత్రాలు, పతాకాలు, ఆయుధాలు, రథ గజ తురంగమాలు, శకల శ కలాలయిన భటుల శరీరాలు కనిపించి కల్లోలాన్ని సృష్టించాయి.

ఎగిరి పడిన కండలు, పేగుల పోగులు, చిట్లిన మెదళ్ళు, నోరు తెరుచుకుని మరణించిన రాజుల్ని చూస్తోంటే తట్టుకోలేకపోయింది గాంధారీదేవి.తళ తళలాడుతోన్న ముత్యాల హారాలు, వజ్ర కిరీటాలు, మెరుస్తోన్న ముంజేతి కడియాలతో బోరగిలపడి నేలపై కూలిన క్షత్రియపుత్రులను చూస్తోంటే దుఃఖాన్ని ఆపులేకపోయిందామె. కుప్పలు కుప్పలుగా బాణాలు, పరిఘాలు, తోమరాలు, ధనుస్సులు, కుంతాలు, కత్తులు, ముసలాలను, క్రూరాయుధాలను చూస్తూ గుండెను దిటవు చేసుకోలేకపోయింది. గుంపులు గుంపులుగా నక్కలు చేరి శవాలను పీక్కు తింటున్నాయి. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా వదలడం లేదు. మీద పడి చీల్చి మరీ మాంసాన్ని అందుకుంటున్నాయి. ఆ అందుకోవడంతో ఒకదానితో ఒకటి పోట్లాటకు దిగుతున్నాయి. కాకులు, గద్దలు, రాబందులు శవాల్ని పొడుచుకు తింటున్నాయి. చూడలేననుకుంది గాంధారి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos