ఆంధ్ర కశ్మీర్ అందాలు చూశారా?

  • In Tourism
  • September 23, 2019
  • 434 Views
ఆంధ్ర కశ్మీర్ అందాలు చూశారా?

ఎత్తైన కొండలు వాటిపై నుంచి తేలిపోయే మేఘాలు దట్టంగా కమ్ముకున్న పొగమంచు పచ్చటి తివాచీని తలపించే పచ్చికపై ఆకాశం నుంచి చుక్కలు రాలాయేమోననే విధంగా అందంగా వికసించిన వివిధ వర్ణాలు పూలు ఇవన్నీ చూడాలంటే కశ్మీర్‌కో లేదా వేరే దేశానికో వెళ్లాల్సిన అవసరం లేదు.విశాఖపట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి వెళితే చాలు.ఇటువంటి ఎన్నో వర్ణణాతీతమైన అందాలు,అద్భుతాలు చూసి పరశించిపోవచ్చు.ఆంధ్ర కశ్మీర్‌,ఆంధ్ర ఊటీగా కూడా పిలుచుకునే లంబసింగి పర్యటన జీవితాంతం చెరగిన జ్ఞాపకాలను అందిస్తుంది.సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల లంబసింగిలో వాతావరణం అన్ని రుతువుల్లోనూ చల్లగానే ఉంటుంది.శీతాకాలంలో ఒక్కోసారి సున్నా డిగ్రీలకు సైతం పడిపోతుంది.

మంచుకొండల మధ్య లంబసింగి..

మంచుకొండల మధ్య లంబసింగి..

శీతాకాలంలో సున్నా లేదా అంతకంటే అంత కంటే తక్కువగా నమోదు కాగా మిగితా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదైతాయి.అందుకే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు లంబసింగికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దీంతో అన్ని కాలాల్లోనూ లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది.

కశ్మీర్‌ కాదు మన మన్యం..

కశ్మీర్‌ కాదు మన మన్యం..


దట్టమైప మన్యం అటవీప్రాంతంలో ఉండడంతో కొండలు, అడవులు దాటుకుంటూ సాగే ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా లోయలు మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే లంబసింగి ప్రయాణం రసవత్తరంగా ఉంటుంది. కాఫీ తోటలు, పసుపు రంగులో కనిపించే వలిసెపూల తోటలు, తాజంగి రిజర్వాయర్,వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

పచ్చటి తివాచీని తలపిస్తున్న కాఫీ తోటలు..

దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగి లో మంచు వర్షం కురుస్తుంది.ఉష్ణోగ్రతల ప్రభావంతో ఉదయం ఆరు గంటలకు కొద్దికొద్దిగా వచ్చే సూర్య కిరణాల మధ్య పొగమంచుల్లో కనిపించే లంబసింగి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు అమితాసక్తి చూపుతారు.మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే లంబసింగిలో సూర్యుడు కాస్త ఆలస్యంగా దర్శనమిచ్చి చాలా త్వరగా అస్తమిస్తాడు.లంబసింగిలో ఉదయం పది గంటలకు నిద్ర లేచే సూర్యుడు మధ్యాహ్నం మూడు గంటలకే కొండల మధ్య వాలిపోతాడు.దీంతో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు ముసురుకొని చలి మొదలవుతుంది.

చీల్చుకు వస్తున్న అరుణకిరణాలు..

అందమైన సూర్యాస్తమయం..

ఈ వాతావరణం వల్లే లంబసింగిలో ఆపిల్‌తో పాటు కాఫీ తోటల సాగు విరివిగిగా ఉంటుంది.ఇక్కడి కాఫీ గింజలను, మిరియాలను అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

లంబసింగిలో పండిన కాఫీ గింజలు..

ఆపిల్‌ తోటలు..

తాజంగి రిజర్వాయర్ ,బోడెకొండమ్మ జలపాతంతో పాటు లంబసింగికి 40 కి. మీ ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 75 కి. మీ ల దూరంలో ధారకొండ జలపాతాలు చూడదగ్గవి.లంబసింగితో పాటు చుట్టుపక్కనున్న చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

దారకొండ జలపాతం..

కాశ్మీరాన్ని తలపించే లోయలు ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.లంబసింగిలో గిరిజనులు విక్రయించే తేనే,పండ్లు,బుట్టలు తదితర అటవీ ఉత్పత్తులు కొనడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు.ఇక లంబసింగి పర్యటనలో బొంగు చికెన్‌,బొంగు బిరియాని తప్పకుండా రుచి చూడాల్సిందే.ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన వెదురు బొంగుల్లో బియ్యం,మాంసంతో తయారు చేసే చికెన్‌,బిరియాని రుచి చూడాల్సిందే కానీ మాటల్లో వర్ణంచలేనిది.

బొంగులో చికెన్‌..

కొద్ది రోజుల క్రితమే బొంగు బిరియాని(బ్యాంబూ బిరియాని)కి జీఐ ట్యాగ్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గత ప్రభుత్వం ప్రతిపాదనలు సైతం పంపించడం గమనార్హం.పర్యాటక పరంగా లంబసింగి ఖ్యాతి గడించడంతో కుటుంబంతో లేదా స్నేహితులతో వెళ్లిన పర్యాటకులు బస చేయడానికి హోంస్టేలు, హోటళ్లు చాలా వెలిశాయి.ఇక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు వ్యాలీ సైతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది..

ఇలా చేరుకోవాలి..
పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే లంబసింగికి చేరుకోవచ్చు.రోడ్డు,రైలు,విమానమార్గాల ద్వారా విశాఖపట్టణం నగరానికి చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో లంబసింగికి చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos