రైతు బంధు కేంద్రానికి స్ఫూర్తి…కేటీఆర్

రైతు బంధు కేంద్రానికి స్ఫూర్తి…కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు స్ఫూర్తితో ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చి బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అయిన రైతుబంధుతో.. దేశ ప్రజలకు సహాయం అందనుండటం హర్షణీయమన్నారు. అనుకరణకు మించిన ప్రశంస మరొకటి లేదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.  కేటీఆర్‌ ట్వీట్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘కేసీఆర్‌ పథకాన్ని మోదీ కాపీ పేస్ట్‌ చేశారు. కేసీఆర్‌ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సొంత ఆలోచన, దూర దృష్టి మోదీకి లేవు. రైతు బంధును కేంద్రం అనుసరించడం.. రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ దూరదృష్టికి అద్దం పట్టాయి. దేశానికి కేసీఆర్‌ నాయకత్వం వహించే సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.

ఎన్నికల బడ్జెటే.. కవిత

‘ఇది నిస్సందేహంగా ఎన్నికల బడ్జెటే. పన్ను సంస్కరణలు మధ్య తరగతి, వేతన జీవులకు ఊరటనిస్తాయి.  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో కేంద్రం విఫలమైంది. ప్రభుత్వ ఘనతలు చెప్పుకున్న పీయూష్‌ గోయల్‌ కేంద్రం వైఫల్యాలను ఎందుకు ప్రస్తావించలేదు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. అనుకరణలో కూడా కేంద్రం సరిగా వ్యవహరించలేదు. రాష్ట్రంలో ఎకరాకు రూ.10 వేలు ఇస్తుంటే.. కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేలే ఇస్తామంటోంది’ అని ఎంపీ కవిత అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos