బీజేపీ నేత కేఎస్‌ ఈశ్వరప్ప తిరుగుబాటు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

బీజేపీ నేత కేఎస్‌ ఈశ్వరప్ప తిరుగుబాటు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి మీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా’ అని తెలిపారు. బీజేపీని, దాని సిద్ధాంతాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు చేస్తున్న పోరాటమని అన్నారు. తిరుగుబాటు నేపథ్యంలో బీజేపీ తనకు నోటీసు జారీ చేయవచ్చని లేదా తనను పార్టీ నుంచి బహిష్కరించవచ్చని కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల్లో తాను గెలిస్తే తల్లి అయిన బీజేపీ పాదాల వద్దకు మద్దతుదారులు తనను కలుపుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తన కుమారుడికి హవేరీ నియోజకవర్గం టికెట్ నిరాకరించడానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కారణమని ఆరోపించారు. యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె, కన్నడ సినీ నటుడు శివరాజ్కుమార్ భార్య, దివంగత డాక్టర్ రాజ్కుమార్ కోడలు గీతా శివరాజ్కుమార్ను కాంగ్రెస్ అభ్యర్థినిగా ఆ పార్టీ పోటీకి దించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos