బీఆర్ఎస్ ఆ పని చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను

బీఆర్ఎస్ ఆ పని చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను

హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నేడు తన నివాసంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తన సవాలుని ఎవరు స్వీకరిస్తారో రావాలన్నారు. బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి అన్నారు. తమ పార్టీ గురించి పక్కన పెట్టి హరీష్ తన పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. ఆరు అడుగులు పెరగడం కాదు కొంచెం బుర్ర ఉండాలని హరీష్రావుని ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో అమలవుతున్న స్కీమ్లను తనతో వస్తే తీసుకెళ్లి చూపిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. స్పెషల్ ఫ్లైట్ పెట్టి మంత్రులను కర్ణాటక తీసుకెళ్తానన్నారు. ‘‘సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవాలి. తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా లేనట్లే. ఆయనకు సబ్జెక్టు లేదు. సీఎం జ్వరంతో ఉంటే కేటీఆర్, హరీష్ ఎందుకు సమీక్ష చేయడం లేదు? కాంగ్రెస్ వాళ్లు రూ.10 కోట్లకు టికెట్లను అమ్ముకుంటున్నారంటూ హరీష్ రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పూర్తిగా వైపల్యం చెందింది. పరీక్ష నిర్వహణ చేత కావడం లేదు. కాంగ్రెస్ వచ్చాక పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది. అవి వంద రోజుల్లో నెరవేరుస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాలాంటి వాళ్లం ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోతాం. కేసీఆర్ లాగా మేం దుబారా ఖర్చులు చేయం. దళితులకు 10 లక్షలు అన్నారు. అందరికి ఇచ్చే సరికి ఎంత టైం పడుతుంది? తెలంగాణలో ఉద్యోగుల జీతాలు 15వ తారీఖు ఇస్తున్నారు. జార్ఖండ్ వంటి రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి. ధనిక రాష్ట్రం తెలంగాణలో 16 నెలల నుంచి 1వ తారీఖు పడుతలేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారు. ఐటీ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేవి. వీళ్ళ లాలూచి వల్ల కొన్ని వెనక్కి పోతున్నాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సెజ్ల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్ ఇంకా కొత్తగా ఎన్ని స్కీమ్ లు వదిలినా ప్రజలు నమ్మరు. దళితుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్దే’’ అని కోమటిరెడ్డి అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos