‘పలమనేరు’లో పరువు హత్య

‘పలమనేరు’లో  పరువు హత్య

పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం, ఊసరపెంట గ్రామంలో శుక్రవారం జరిగిన అమానుష పరువు హత్య శని వారం వెలుగులోకి వచ్చింది. పచ్చిబాలింతను తల్లి దండ్రులు, అన్నదమ్ములు ఉరి వేసి దారుణంగా చంపారు. బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. పలమనేరు అర్బన్ సీఐ ఈద్రుబాషా, గ్రామస్తుల కథనం మేరకు.. ఊసర పెంట గ్రామంలో భాస్కర్నాయుడు, గోవిందయ్య పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. భాస్కర్ నాయుడు కుమార్తె హేమావతి (23), గోవిందయ్య కుమారుడు కేశవ(25) మూడేళ్ల కిందట ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి హేమావతి కుటుంబీకులు అడ్డు తగిలారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు. హేమావతి అప్పటికే మేజర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ప్రయత్నం ఈడేర లేదు. దరిమిలా వారిద్దరూ కుప్పంలోని ఒక గుడిలో ఆ పెళ్లి చేసుకుని తిరుపతిలో తలదాచుకున్నారు. కేశవ కూలి పనులు చేస్తూ తన భార్యను బీ టెక్ చదివించాడు. వారం కిందట హేమావతి పలమనేరు ప్రాంతీయ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజులకిందట తల్లి, బిడ్డను స్వ గ్రామానికి తీసుకొచ్చారు. శుక్రవారం భార్యా, బిడ్డలకు పలమనేరు ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు జరిపించి ఇంటికి వెళుతుండగా హేమవతి కుటుంబీకులు గ్రామ సరిహద్దులో అటకాయించారు. కత్తులతో బెదిరించి దౌర్జన్యంగా బిడ్డతో సహా హేమావతిని దారి పొడవునా కొడుతూ, కన్నబిడ్డ అనే మమకారం లేకుండా ఇంటి సమీపంలోని పొలం వద్దకు లాక్కెళ్లారు. తండ్రి భాస్కర్నాయుడు, తల్లి వరలక్ష్మి, సోదరులు భాను ప్రకాష్, చరణ్, నిఖిల తదితరులు కలసి హేమావతికి ఉరేసి ప్రాణం తీశారు. పక్కనే ఉన్న బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. హేమావతిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా లాక్కుపోవటాన్ని చరవాణిలో చిత్రీకరించిన కేశవులు పోలీసులకు కబురందించారు. దరిమిలా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. బావిలో హేమావతి శవం కనిపించింది. ప్రధాన నిందితులు అడవిలోకి పారి పోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా కేశవ కుటుంబీకులు మృతురాలి తల్లి, సోదరి బంధువులపై దాడులకు దిగి వారి ఇంటిని ధ్వంసం చేశారు. గడ్డి వామిని కాల్చివేశారు. ఓ బైక్ను ధ్వంసం చేశారు. గొడవలు పెద్దవి కాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మృతిరాలి తల్లి, సోదరిపై దాడి జరగకుండా వారిని నిర్బంధించారు.
తల్లి బావిలో శవం కాగా గట్టు మీది వారం రోజుల పసి కందును చూసి బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డకు తల్లిని లేకుండా చేశారని రోదించారు. గ్రామంలో విషాదం, ఉద్రిక్తత కొనసాగుతోంది. అవాంఛనీయాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos