డేటాచోరీ కేసులో కీలక మలుపులు..

డేటాచోరీ కేసులో కీలక మలుపులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటున్న మలుపులు ఆసక్తిని రేపుతున్నాయి. నగరంలోని మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో ఉన్న తెదేపా యాప్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల డేటాను దుర్వనియోగం చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపించడం తదనంతరం జరుగుతున్న పరిణామాలతో తెదేపా ఉక్కిరిబిక్కరి అవుతోంది.వైసీపీ నేతల ఫిర్యాదుతో ఆదివారం యాప్‌ సర్వీస్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్‌ పోలీసులు హార్డ్‌డిస్క్‌లు,పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఉద్యోగులు ఫణి, భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆదివారం నుంచి తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ సహోద్యోగి అశోక్‌ హైకోర్టును ఆశ్రయించాడు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో పిటిషన్ ను అత్యవసరంగా ఇంటివద్దే విచారించాలని కోరారు.ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ నలుగురు ఉద్యోగులు ఫణి, భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లను తమముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే అధికారులు నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.ఇదిలా ఉండగా నిన్న హౌస్ మోషన్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. కేసు డైరీలో బాధితుల నుంచి సంతకాలు తీసుకుని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్న కాగితాలతోపాటు సంతకాలున్న ఖాళీ కాగితాలుండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఖాళీ కాగితాల్లో సంతకాలేమిటని ప్రశ్నించింది. అయితే అవి రెవెన్యూ అధికారి సంతకాలని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. సాధారణంగా సోదాలు నిర్వహించినపుడుగానీ… వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నపుడు గానీ.. పంచనామా పూర్తయ్యాక రెవెన్యూ అధికారితో సంతకం తీసుకుంటారని.. ఇక్కడ ముందుగానే తెల్ల కాగితాల్లో సంతకాలు తీసుకోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. వీటన్నింటినీ చూస్తే ఆ నలుగురూ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపింది.ఏ పౌరుడినీ కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోరాదని వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు…నలుగురిని కుటుంబ సభ్యులను అప్పగించబోతుండడం చర్చనీయాంశంగా మారింది..
ఐటి గ్రిడ్‌పై మరో కేసు..
తెదేపాకు మొబైల్‌ యాప్‌ సేవలు అందిస్తున్న ఐటి గ్రిడ్‌పై సోమవారం మరో కేసు నమోదయింది.సేవ మిత్ర యాప్‌ ద్వారా ఐటిగ్రిడ్‌ సంస్థ ప్రజలకు సంబంధించి డేటా చోరీ చేసారంటూ వైసీపికి చెందిన రాంరెడ్డి అనే నేత ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యాలయం చుట్టుపక్కల పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
భయమెందుకు?
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వివరాలకు సంబంధించి డేటా చోరీకి సంబంధించి తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానికి వచ్చిన ఓ విదేశీ పౌరుడు పర్సు పోగొట్టుకుంటే అమరావతి పోలీసులు ఫిర్యాదు చేస్తాడా లేదా తన దేశం పోలీసులకు ఫిర్యాదు చేస్తాడా అంటూ ప్రశ్నించాడు. హైదరాబాద్‌లో ఉంటున్న యాప్‌ సంస్థపై ఫిర్యాదు వస్తే తెలంగాణ పోలీసులు కాకుండా ఇంకెవర విచారణ,చర్యలు చేపడతారంటూ ప్రశ్నించారు.అయినా అసలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తెలంగాణలో పనేంటంటూ ప్రశ్నించారు.ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని, ఐటీ చట్టం ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజల డేటాతో ఏం అవసరం.. సానుభూతి కోసమే సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు..
రేవంత్‌రెడ్డిని ఎంతకు కొన్నారు?
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు,ఆత్రం సక్కు తెరాస చేరుతుండడాన్ని తప్పుబడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెరాసపై ఆరోపణలు చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.గిరిజన సంక్షేమం కోసమే తెరాసలో చేరుతున్నామని అవసరమైతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేస్తామంటూ ఇద్దరు నేతలు చెప్పారన్నారు.శాసనసభ ఎన్నికలకు ముందు తెరాస ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డిని ఎంతకు కొన్నారో,తెదేపాకు చెందిన రేవంత్‌రెడ్డిని ఎంతకు కొన్నారో ఉత్తమ్‌కుమార్‌ చెప్పాలన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos