సామూహిక వలసలు…కశ్మీర్‌ పండిట్ల హెచ్చరిక

సామూహిక వలసలు…కశ్మీర్‌ పండిట్ల హెచ్చరిక

శ్రీనగర్: ఉగ్రవాదుల లక్ష్యిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.
ఇరవై నాలుగు గంటల్లోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయను వదిలి వెళ్లిపోతామంటూ ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన సుమారు 4,000 మంది కశ్మీర్ పండిట్లు హెచ్చరించారు. జమ్మూకు చెందిన హిందూ స్కూల్ టీచర్ రజనీ బాలను స్కూలు బయటే ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపథ్యంలో పండిట్ ఉద్యోగులు ఈ హెచ్చరికలు చేశారు. దీనికి ముందు గత నెలలో కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు అతని కార్యాలయంలోనే కాల్చిచంపారు. రజనీ బాలను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనతో మరోసారి కశ్మీర్ పండిట్లు హెచ్చరికలు జారీచేయడంతో మైగ్రెంట్ పండిట్ ట్రాన్సిట్ క్యాంపులను అధికారులు పలు ప్రాంతాల్లో బుధవారం సీల్ చేశారు. శ్రీనగర్‌లోని ఇంద్రానగర్ వద్ద పలువురు కశ్మీర్ పండిట్లు నివసిస్తుండటంతో అక్కడి ఎంట్రీ పాయింట్ల వద్ద రాకపోకలను నిలిపేశారు. కశ్మీర్ పండిట్లను బయటకు వచ్చేందుకు అనుమతించ లేదు.
ట్రాన్సిట్ క్యాంపులలో పెద్దదైన వెసు పండిట్ కాలనీలో ఉంటున్న వందలాది కశ్మీర్ పండిట్లు బుధవారం నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మైనారిటీల ప్రాణాలను రక్షించాలని, కశ్మీర్ లోయ నుంచి తమను వేరేచోటకు తమను తరలించాలని నినాదాలు చేశారు. దీంతో కశ్మీర్ పండిట్లు ఎవరూ బయటకు రాకుండా పలు క్యాంపుల వద్ద ప్రధాన గేట్లకు అధికారులు తాళాలు వేశారు.
కాగా, ప్రభుత్వ యంత్రాగానికి పలు మార్లు తమ సమస్యలు చెప్పి విసిగిపోయామని, అయినా వాటిని పెడచెవిన పెడుతున్నారని పలువురు కశ్మీర్ పండిట్లు వాపోయారు. ”మమ్మల్ని వేరో చేటికి మారిస్తే సురక్షితంగా ఉంటాం. లెఫ్టినెంట్ గవర్నర్‌ను (మనోజ్ సిన్హా) మా ప్రతినిధి బృందం కలిసి మమ్మల్ని కాపాడామని వేడుకుంది. లోయలో పరిస్థితి చక్కబడేంత వరకూ కనీసం రెండు, మూడేళ్లు తాత్కాలిక శిబిరాలను మార్చమన్నాం. ఇందువల్ల టెర్రరిస్టుల ఏరివేతకు ఐజీపీకి గడువు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది” అని కశ్మీర్ పండిట్ ఒకరు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos