ఈ క్షేత్రం తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం..

ఈ క్షేత్రం తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం..

సువిశాల భారతదేశంలో రాజ్యాంగం,హక్కులు,కోర్టులు,ఆధునిక చట్టాలు,శిక్షలు ఇలా ఎన్ని ఉన్నాకొన్ని గిరిజన ప్రాంతాల్లో మరికొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు,కట్టుబాట్లు,సంప్రదాయాలకే ప్రాధాన్యత ఉంటోంది.తప్పు చేసినా లేదా ఏదైనా సమస్యలు,వివాదాల పరిష్కారం కోసం రచ్చబండ దగ్గరో లేక గుళ్లల్లోనే విచారణ జరిపి తీర్పులు చెప్పడం,శిక్షలు విధించడం ఇలా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.ఇవి మూఢనమ్మకాలా లేక అక్కడి ప్రజల విశ్వాసాలు, నమ్మకాలా అనే విషయం పక్కనపెడితే కొన్ని ప్రాంతాల్లోని ఆచారాలు,కట్టుబాట్లు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.కర్ణాటక-కేరళ రాష్ట్ర సరిహద్దుల్లోని కాసరగూడు పట్టణంలోని కానత్తూరు అనే క్షేత్రం కూడా ఇదేకోవలోకి వస్తుంది.విష్ణుమూర్తి, రక్తేశ్వరీ, రక్తచాముండి, ఉగ్రమూర్తి ప్రధాన దైవమూర్తులు పూజలందుకుంటున్న ఈ క్షేత్రాన్ని అక్కడి ప్రజలు చాలా మహిమ కలిగిన క్షేత్రంగా భావిస్తుంటారు.

కానత్తూరు క్షేత్రం


సుప్రీం కోర్టులో కూడా పరిష్కారానికి నోచుకోని కేసులకు కూడా ఈ దేవాలయంలో పరిష్కారం లభిస్తుంటుందని భావిస్తారు. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు.ఇక్కడ కేసులకు పరిష్కారం కూడా కోర్టుల్లో జరిగే విధంగా ఉండడం మరో విశేషం.ఇక్కడి విచారణ తీరును పరిశీలిస్తే..ఎవరైనా వ్యక్తులు క్షేత్రంలో ఫిర్యాదు దాఖలు చేస్తే దాఖలు పత్రాన్ని పరిశీలించిన అనంతరం క్షేత్ర నిర్వాహకులు కక్షిదారుడి ప్రత్యర్థులకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేస్తారు.ఒక్కసారి క్షేత్రం నుంచి నోటీసులు అందితే తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందే.ఒకవేళ ఈ క్షేత్రం నుంచి వచ్చిన నోటీసుని నిర్లక్ష్యం చేసినా లేదా అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయినా నిర్వాహకులు మరో నోటీసును పంపుతారు. ఇలా మొత్తం మూడు నోటీసులను పంపుతారు. మూడు సార్లు నోటీసుకు స్పందించకుంటే ఈ క్షేత్ర నిర్వాహకులు ఇక్కడి దేవతలకు చెబుతారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే నోటీసును నిర్లక్షం చేసినవారిని ఆ దేవుడే శిక్షిస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం.

సమస్యల పరిష్కారం కోసం ..


ఈ క్షేత్రంలో ఇచ్చే తీర్పును ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. లేదంటే ఖచ్చితంగా ఆ దేవతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఇక్కడి విశ్వాసం.ఆస్తి కేసులు,వివాహ కేసులు ఇలా ఎన్నో వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి మాత్రమే ఆ సొమ్ము చేరుతుందని చెబుతారు.క్షేత్రంలో సమస్యలు,వివాదాల పరిష్కారం కోసం వచ్చిన వారు వాటికి పరిష్కారం లభించాక తప్పకుండా ముడుపులు చెల్లించాల్సిందే.ఒకవేళ ముడుపులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారని ప్రజల నమ్మకం.ఇక ఈ క్షేత్రంలో ప్రతి ఏటా జరిగే కడియాళి మహోత్సవాలు మరో ప్రత్యేక ఆకర్షణ.క్షేత్రంలోని నలుగురు దేవుళ్లకు భూతారాధన చేసిన అనంతరం నిర్వహించే కళియాట నాట్యం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.

కళియాట నాట్యంలో నాట్యాకారుడి రౌద్రావతారం..


ఈ నాట్యం చేసేవారు ఒక వారం పాటు శాఖాహారాన్ని భుజిస్తారు. ఇక ఈ నాట్యం చేసే ముందు రోజు ద్రవ ఆహారాన్ని మాత్రం తీసుకొంటారు.వీరు ధరించే ఆభరణాలు, దుస్తులు చాలా బరువుగా ఉంటాయని సామాన్యులు వాటిని మోయలేరని చెబుతారు.అందువల్లే ఈ నాట్యం చేసేవారిని దైవ సమానులుగా పూజిస్తారు.మరో విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో ప్రేతాత్మలకు సైతం విమోచనం లభిస్తుందని ప్రతీతి.ఎప్పుడైనా అటువైపు పర్యాటకం కోసం వెళితే ఈ క్షేత్రాన్ని కూడా దర్శించేయండి..

కళియాట నాట్యంలో నాట్యాకారుడి రౌద్రావతారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos