బీజేపీకి జాట్‌ల సెగ

బీజేపీకి జాట్‌ల సెగ

జైపూర్: బీజేపీపై జాట్ వర్గం ఆగ్రహంతో ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్తో పాటు పలు ఇతర రాష్ర్టాల్లో కమలం పార్టీకి ఇది నష్టం చేకూర్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కేంద్ర మంత్రి షెకావత్కు పట్టున్న పార్లమెంట్ నియోజకవర్గాలైన జుంజును, చురు, శికర్, నాగౌర్లలో కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉందని భావిస్తున్నారు. వారి కోపం బీజేపీ సొంతంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లను సాధించాలన్న లక్ష్యానికి గండికొట్టేలా కనిపిస్తున్నది. బీజేపీపై ఆగ్రహానికి రాజస్థాన్ ఎన్నికల్లోనే బీజం పడింది. అధికార స్థానాల నుంచి తమను తప్పించడమే కాక, తమను చిన్నచూపు చూస్తున్నారని జాట్లు భావిస్తున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై పగ తీర్చుకునే సమయం వచ్చిందని వారు భావిస్తున్నారు. జాట్లలోని అసంతృప్తి కేవలం రాజస్థాన్కే పరిమితం కాలేదని, వారు అధికంగా ఉన్న హర్యానా, పశ్చిమ యూపీ, ఢిల్లీలలో కూడా ఉందని ఆఖిల భారత జాట్ ఆరక్షన్ సంఘర్ష్ సమతి అధ్యక్షుడు యశ్పాల్ మాలిక్ తెలిపారు. మోదీ ప్రభుత్వంపై జాట్ల ఆగ్రహానికి రైతుల ఆందోళన, అగ్నిపథ్ పథకాలు, రాజకీయ వివక్ష ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. పలు డిమాండ్లతో 2020-21లో ప్రారంభమైన రైతుల ఉద్యమంలో పంజాబ్లోని జాట్ సిక్కు రైతులు, హర్యానా, పశ్బిమ యూపీ, రాజస్థాన్లోని జాట్ రైతులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఉద్యమంలో 750 మంది రైతులు అసువులు బాసినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారాన్ని ఇవ్వలేదు. రెండోసారి జరిపిన రైతు ఉద్యమం పట్ల కూడా కేంద్రం అణచివేత విధానం అవలంబించడం పట్ల జాట్లు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన వారిపై బుల్లెట్లు, నీటి గోళాలు ప్రయోగించారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజేష్ భూషణ్పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు. అతనిపై చర్య తీసుకోవాలంటూ చేసిన ఆందోళనను మోదీ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ ఉదంతంలో బ్రిజేష్పై తిరగబడిన పలువురు మహిళా రెజ్లర్లు జాట్ వర్గానికి చెందిన వారే. తమ ఆడపడుచులకు వచ్చిన కష్టం చూసి దేశంలోని పలువురితో పాటు జాట్ వర్గం కన్నీరు పెట్టుకుంది. ‘దేశానికి పతకాలు తెచ్చి పెట్టిన మా ఆడపడుచులపై మోదీ ఇలాగేనా వ్యవహరించేది?’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవుల పంపిణీలో జాట్ వర్గం పట్ల అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. 2023 రాజస్థాన్ ఎన్నికల ముందు నుంచీ ఇది ప్రారంభమైంది. అప్పటివరకు రాజస్థాన్కు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జాట్ నేత సతీష్ పూనియాను తప్పించి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఎంపీ సీపీ జోషీకి ఆ పదవిని కట్టబెట్టారు. అలాగే జాట్ వంశీయుల కోడలైన మాజీ సీఎం వసుంధర రాజే పట్ల నరేంద్ర మోదీ పూర్తి వివక్షను ప్రదర్శించారని వారు కోపంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా జాట్లకు ఎలాంటి ప్రాధాన్యం గల పదవులు ఇవ్వలేదని ఒక మాజీ ఎంపీ తెలిపారు.
అగ్నిపథ్ పథకాన్ని తెచ్చి మిలటరీలో కేవలం నాలుగేళ్ల కాలానికే యువతను నియమించడం పట్ల వారు మండిపడుతున్నారు. ఎందుకంటే మిలటరీకి వెళ్తున్న వారిలో జాట్ వర్గానికి చెందిన యువకులే అధికంగా ఉంటున్నారు. ప్రధాని నిర్ణయంతో తమ యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos