టపాసులు కాల్చడం హిందూ సంప్రదాయం కాదు..

టపాసులు కాల్చడం హిందూ సంప్రదాయం కాదు..

హిందూ పండగలు వస్తున్నాయంటే చాలు ఎదోఒక వివాదం చెలరేగాల్సిందే అనేవిధంగా పరిస్థితులు నెలకొన్నాయి. సంక్రాంతి నుంచి మొదలుకొని దీపావళి వరకు అన్ని పండగల చుట్టూ ఎదో ఒక వివాదం రేగడం రివాజుగా మారింది.పండగల వెనుక ఉన్న కారణం వదిలేసి కేవలం పండగల నేపథ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది.ఇప్పటికే ఎంతో మంది హిందూ పండగలపై నోరు పారేసుకోగా తాజాగా కర్ణాటక ఐపిఎస్‌ అధికారి డి. రూపా దీపావళి రోజున టపాసులు కాల్చే ఆనవాయితీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.దీపావళి పండుగ రోజున పటాసులు కాల్చడం.. హిందూ సంప్రదాయం కాదని ఇతిహాసాలు, పురాణాల్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదని కర్ణాటక ఐపిఎస్‌ అధికారి డి. రూపా అభిప్రాయపడ్డారు. క్రాకర్లు కాల్చలేకపోయామని బాధపడేవారి కోసం… ఇది హిందూ సాంప్రదాయమని అనుకునేవారి కోసం నవంబర్‌ 14 దీపావళి రోజున ఆమె సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ”మన పురాణాల్లో క్రాకర్ల గురించి ప్రస్తావించలేదు. యూరోపియన్స్‌ మన దేశానికి ఈ సంస్కృతిని తీసుకొచ్చారు. ఇది హిందూ మతానికి సంబంధించిన ప్రధాన సంప్రదాయం లేదా ఆచారం కాదు” అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ‘ఇతర మతాల ఆచారాలను కూడా ప్రశ్నిస్తారా’ అని ట్విట్టర్‌ వినియోగదారులు ఆమెను అడిగారు. అలాగే ‘ట్రూ ఇండోలజీ’ భారతదేశపు ప్రాచీన గ్రంథాలలో క్రాకర్లు గురించి ప్రస్తావించబడిందని పేర్కొన్నారు. అయితే రూపా ఈ వాదనను ఖండించారు. ట్రూ ఇండాలజీకి ఆధారాలను చూపించాలని ఆమె కోరారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ‘ట్రూ ఇండాలజీ’ హ్యాండిల్‌ను తొలగించారు. దీనిపై కొంతమంది ట్విటర్‌ యూజర్లు, సినీనటి కంగనారనౌత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండాలజీ హ్యాండిల్‌ను తొలగించడం ద్వారా ‘ఆఫీసర్‌ రూప ప్రతీకారం తీర్చుకున్నారని.. వాస్తవాలతో వాదనలను గెలవలేకపోవడంవల్లే ఆమె అలా తొలగించారని’ కంగనా రనౌత్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా ట్రెండ్‌ అవుతున్న వార్తలపై రూపా నిశ్శబ్ధం వహించడాన్ని కూడా కొందరు ప్రశ్నించారు. వాటికి ప్రతిస్పందనగా ‘ట్విట్టర్‌కు మించిన జీవితం ఉంది’ అంటూ రూపా రీట్వీట్‌ చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos