హత్రాస్ కేసులోకి నిర్భయ న్యాయవాదులు ఎంట్రీ..

హత్రాస్ కేసులోకి నిర్భయ న్యాయవాదులు ఎంట్రీ..

దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న హత్రాస్ హత్యాచారం ఘటనలో మరో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.నిర్భయ కేసులో కోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులు మళ్ళీ హత్రాస్ కేసులో బరిలోకి దిగారు.నిర్భయ కేసులో నిందితుల తరపున వాదించిన అజయ్ ప్రకాశ్ సింగ్ హత్రాస్ కేసులో నిందితుల తరుపున వాదించడానికి సిద్దమయ్యాడు.నలుగురు నిందితుల్నిరక్షించేందుకు ఆయన రంగంలోకి దిగారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అజయ్ తమ తరఫున కేసును వాదించనున్నట్లుగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఒక ప్రకటనను విడుదల చేసింది.హాథ్రస్ ఉదంతంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రముఖ న్యాయవాది అజయ్ సింగ్ వాదనలు వినిపిస్తారని.. తమ వినతిని మన్నించి అమాయకులైన ఠాకూర్ యువకులను రక్షించేందుకు ముందుకు వచ్చిన అజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. తమ వర్గానికి చెందిన యువకులను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకే వారిని కాపాడేందుకు తాము నడుం బిగించినట్లు సదరు సంస్థ చెబుతోంది. ఈ కేసుకు అవసరమైన నిధుల్ని చందాల రూపంలో సేకరిస్తామని వారు చెబుతున్నారు.అదేసమయంలో హత్రాస్ బాధితురాలి తల్లిదండ్రుల తరపున వాదించేందుకు నిర్భయ కేసులో నిర్భయ తరపున వాదనలు వినిపించి, వారికి ఉరిశిక్ష పడేలా చేసి, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ ముందుకు వచ్చారు.దీంతో ఈ కేసు విచారణ ఎలా జరుగుతుందోనన్న ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. ఎందుకంటే, ఈ కేసులో నిందితులు యువతిపై దాడి చేశారే తప్ప, అత్యాచారం చేయలేదని వైద్య రిపోర్టులు రావడంతో కేసు ఏ మేరకు నిలిచి, కఠిన శిక్ష పడుతుందన్న విషయమై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఓ 20 యేళ్ళ దళిత బాలికపై క్షత్రియ వర్గానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను కత్తిరించారు. అయితే, ఈ కామాంధుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos