159 జిల్లాల్లో పడిపోయిన ఫిక్స్ డ్ డిపాజిట్లు

159 జిల్లాల్లో పడిపోయిన ఫిక్స్ డ్ డిపాజిట్లు

న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా 25 రాష్ట్రాల్లోని 159 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి. వీటిలో తెలంగాణలోని 4, ఆంధ్రప్రదేశ్ లోని 2 జిల్లాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి (గత ఆర్థిక సంవత్సరం 2020–2021) త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ మదుపు వివరాల్ని విడుదల చేసింది. 2018 ఏప్రిల్ – జూన్ తో 53 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గిపోతే.. ఇప్పుడు అది దాదాపు మూడు రెట్లయింది. నిరుటి తొలి త్రైమాసికంలో 22 జిల్లాల్లో, రెండు వరుస త్రైమాసికాల్లో 15 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు తగ్గాయి. కరోనా వల్ల కుటుంబ అవసరాల్ని తీర్చుకునేందుకు జనాలు డబ్బును బ్యాంకు నుంచి ఉపసంహరించు కుంటున్నట్టు నిపుణులు చెప్పారు. దీంతో ప్రజల వద్ద నగదు చెలామణి పెరుగుతోంది. 2020 మార్చి 13 నుంచి 2021 మే 21 మధ్య జనం వద్ద ఉన్న నగదులో 5.54 లక్షల కోట్ల పెరుగుదల నమోదైంది. మొత్తం చెలామణి నగదు రూ.28.62 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 5.86 శాతం- రూ.14.94 లక్షల కోట్ల నుంచి రూ.14.06 లక్షల కోట్లకు పడిపోయింది. డిపాజిట్లు భారీగా తగ్గిన జిల్లాల్లో యూపీవే 23 ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 21, కర్ణాటక 16, మహారాష్ట్రలో 11 జిల్లాల్లో జనాలు ఫిక్స్ డ్ డిపాజిట్లను డ్రా చేసుకున్నారు. అత్యధికంగా డిపాజిట్లను డ్రా చేసిన జిల్లాగా తమిళనాడులోని నాగపట్టణం నిలిచింది. అక్కడ 24 శాతం డిపాజిట్లను జనం బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos