20 కంటే ఎక్కువ ఉంటే టోల్‌ఫ్రీ..

వారంతం రోజుల్లోనో,పండగలకు తదితర ముఖ్యపనులపై కారులో కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు బయలు దేరే నగరవాసులు గంటల తరబడి క్యూలో నిల్చునే తిప్పలు,నిరీక్షణకు తెర పడనుంది.రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండానే దూసుకెళ్లిపోవడానికి హెచ్‌ఎండీఏ నిబంధనలు సడలిస్తోంది.అయితే 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకే టోల్‌లైన్‌లో ఉంటే మాత్రమే ఛార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవడానికి అనుమతిస్తారు.కొత్తగా సడలించనున్న నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలంటూ టోల్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి ముంబయి, నాగ్‌పుర్‌,విజయవాడ,బెంగళూరు వైపు వెళ్లే జాతీయ రహదారులు ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయడంతో సాధారణ రోజుల్లోనే ఆయా మార్గాల్లో సగటును ప్రతరోజు 1.30లక్షల వాహనాలు వెళుతున్నాయి.

ఇక వారాంతాలు,వరనుస శెలవులు,పండగ రోజుల్లో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.ముఖ్యంగా సంక్రాంతి పండగ సమయంలో ఆయా టోల్‌గేట్‌లలో ఒక్కోసారి ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.దీన్ని దృష్టిలో పెట్టుకున్న హెచ్‌ఎండీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.టోల్‌ వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(టీఎంఎస్‌)ను అమలు చేయడానికి హెచ్‌ఎండీఏ గతంలో నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించగా ఇప్పటి వరకు అందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు.69 టోల్‌లైన్‌లను స్మార్ట్‌లైన్‌లుగా మార్చినా వినియోగదారులకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో ఫాస్ట్‌ట్యాగ్‌లు నిరుపయోగంగా మారాయి.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాత్రి,పగలు అనే తేడా లేకుండా టోల్‌లైన్‌లో 20 కంటే ఎక్కువ వాహనాలు ఉంటే ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వదిలేయాలంటూ టోల్‌ వసూలు సంస్థలకు సూచించింది.

ఏప్రిల్‌౧వ తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావడానికి హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతోపాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నానక్‌రాంగూడ, శంషాబాద్‌ల వద్ద అదనంగా మరిన్ని టోల్‌లైన్లు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు.కొత్త నిబంధనతో పండగలు,వరుసశెలవు రోజుల్లో ఇళ్లకు వెళ్లే ప్రజలకు డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని హెచ్‌ఎండీఏ అధికారలు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా హెచ్‌ఎండీఏ అమలు చేయనున్న కొత్త నిబంధనను టోల్‌ సంస్థలు పాటిస్తాయా అన్నదే యక్షప్రశ్నగా మారింది. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయంలో టోల్‌ వసూలు చేయరాదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా టోల్‌ సంస్థలు ఆదేశాలు పట్టించుకోకుండా టోల్‌ వసూలు చేసాయి. మరి హెచ్‌ఎండీఏ ఆదేశాలు ఎంత వరకు అమలవుతాయో, ఆదేశాలను టోల్‌ సంస్థలు ఎంతవరకు పాటిస్తాయో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos