భారత్‌ను బండ బూతులు తిట్టిన కిస్సింజర్‌కు మోదీ కితాబు…!

భారత్‌ను బండ బూతులు తిట్టిన కిస్సింజర్‌కు మోదీ కితాబు…!

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన అమెరికా మాజీ రాజకీయ దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోవడమే కాకుండా ఆయన్ని ప్రశంసిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేయడంపై దుమారం రేగుతోంది. భారతదేశాన్ని, భారతీయులను పదే పదే నీచంగా దూషించిన ఆగర్భ శత్రువైన కిస్సింజర్‌ను అంతర్జాతీయ రాజకీయ, దౌత్య సంబంధాల్లో మార్గదర్శకుడని వర్ణించడం ఏమిటని భారతీయ మేథావులు విమర్శిస్తున్నారు. 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా అమెరికా తరపున పాకిస్థాన్‌కు ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలను పంపించడమే కాకుండా, అదే సంవత్సరం భారత్‌కు వ్యతిరేకంగా చైనాను రెచ్చగొట్టిన యుద్ధోన్మాది కిస్సింజర్‌ను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నిస్తున్నారు. భారతీయులను ‘సన్స్ ఆఫ్ బిచెస్’ అని, ‘బాస్టర్డ్స్’అని, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని ‘బిచ్’ అని విమర్శించిన కుసంస్కారిని అంతర్జాతీయ సంబంధాల మార్గదర్శిగా ఎలా అభివర్ణిస్తారని మేధావులు ఆశ్చర్యపడుతున్నారు. ఏడో దశకంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా, ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన కిస్సింజర్, భారత్, పాక్ యుద్ధంలో అమెరికా తరఫున కీలక పాత్ర వహించారు. పాకిస్థాన్‌లోని హిందువులు, బెంగాలీలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం చేపట్టిన జనన హననాలను ప్రోత్సహించడం ద్వారా భారత్, పాక్ (బంగ్లాదేశ్ విముక్తి) యుద్ధానికి కారణమయ్యారు. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌ను అమెరికా దౌత్యపరంగా సమర్థించడమే కాకుండా ఆయుధాలను, యుద్ధ విమానాలను సరఫరా చేసిందని ‘ది బ్లడ్ టెలిగ్రామ్’అనే పుస్తకంలో ప్రముఖ విద్యావేత్త, పరిశోధకుడు గేరి జే బాస్ పేర్కొన్నారు. అప్పుడు అమెరికా పార్లమెంట్ అభిప్రాయానికి విరుద్ధంగా కిస్సింజర్ భారత్ పట్ల దూకుడుగా వ్యవహరించారని బాస్ తెలిపారు. ‘బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ అణచివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టాక రెండు నెలలకు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఆయుధాలను పాకిస్థాకు పంపించడం ద్వారా రెండు లక్షల మంది పౌరుల మృతికి అమెరికా కారణం అయింది’ అని నాడు అమెరికా పార్లమెంట్‌లో సభ్యుడు ఎడ్మండ్ ముష్కీ విమర్శించడం ఇక్కడ గమనార్హం. 1971 జులై నెలలో హెన్రీ కిస్సింజర్ భారత్ సందర్శించినప్పుడు ఆయన్ని ఉద్దేశించి అప్పటి భారత విదేశాంగ మంత్రి జగ్జీవన్ రామ్ ‘కేవలం నీవల్ల ఈరోజు పాకిస్థాన్ బతికిపోయింది’ అని వ్యాఖ్యానించడం మరింత గమనార్హం. దౌత్యపరంగా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కిస్సింజర్, 1971లో అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌ లైను కలుసుకొని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టారని బాస్ తన పుస్తకంలో రాశారు. అదే సమయంలో అమెరికా అతి పెద్ద యుద్ధ విమానాలను తీసుకెళ్లే నౌకతో పాటు ఓ నౌకా దళాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగాళాఖాతానికి తరలించింది. తద్వారా బెంగాల్ నగరంపై దాడి చేస్తామని హెచ్చరించిందని బాస్ పేర్కొన్నారు. పాక్ సైన్యం బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులు, బెంగాలీలను ఎంపిక చేసుకొని నర మేధానికి పాల్పడుతోందంటూ పాక్‌లోని అప్పటి దౌత్యవేత్త ఆర్చర్ బ్లడ్ అమెరికా అధ్యక్షుడికి టెలిగ్రామ్ పంపించగా, దానిపై కిస్సింజర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్చర్ బ్లడ్‌ను ఉద్దేశించి ‘మానియాక్ ఇన్ డక్కా (ఢాకా)’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆర్చర్‌ను వెనక్కి పిలిపించి ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పడు భయంతో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వేలాది హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షడు రిచర్డ్ నిక్సన్‌తో కిస్సింజర్ చర్చలు జరిపిన సందర్భంగా ఆయన భారతీయులను ఉద్దేశించి ‘సన్స్ ఆఫ్ బిచెస్’ అని తిట్టారు. మరో సందర్భంలో భారత్ కరువు బారిన పడాలంటూ నిక్సన్ శాపనార్థం పెట్టినప్పుడు కూడా భారతీయులను ఉద్దేశించి ‘బాస్టర్డ్స్’ అని విమర్శించినట్లు ఇప్పటికీ లిఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ, 1971లో రిచర్డ్ నిక్సన్, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశించి ‘ఓల్డ్ విచ్’ అని వ్యాఖ్యానించగా కిస్సింజర్ ‘బిచ్’ అని వ్యాఖ్యానించినట్లు 2005లో బయటకు వచ్చిన ‘ఓవల్ ఆఫీస్’టేప్స్‌లో వెల్లడయింది. ఓ ప్రధాన మంత్రిగా, జాతీయవాదిగా నరేంద్ర మోదీ, కిస్సింజర్‌ను అన్ని విధాలా విమర్శించాల్సిందిపోయి ప్రశంసించడం అంతు చిక్కడం లేదని మేథావులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడో పదవుల నుంచి దిగిపోయి ఇప్పుడు 96 ఏళ్లు వచ్చిన కిస్సింజర్ ఏ రకంగాను భారత్ భవిష్య దౌత్య సంబంధాలకు కూడా ఉపయోగపడరు. కనుక చారిత్రక విషయాలు తెలియని భారతీయ దౌత్యవేత్తలు మోదీని పక్కతోవ పట్టించి ఉంటారని విద్యావేత్తలు, మేథావులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos