భారత్ క్రికెట్ జట్టులో స్థానానికి తీవ్ర పోటీ

  • In Sports
  • January 25, 2019
  • 175 Views
భారత్ క్రికెట్ జట్టులో స్థానానికి తీవ్ర పోటీ

మౌంట్‌ మాంగనూయ్‌: భారత జట్టులో విపరీతమైన పోటీ పెరిగిపోయిందని ఓపెనర్ శిఖర్ ధావన్‌ అన్నాడు. యువ ఆటగాళ్లు జట్టులోకి రాకముందే పరిణతి సాధిస్తున్నారని పేర్కొన్నాడు. అండర్-19 సారథి పృథ్వీషా గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడి సహచరుడు శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కివీస్‌తో రెండే వన్డేకు ముందు ధావన్‌ మాట్లాడుతూ..‘యువ ఆటగాళ్లు త్వరగా పరిణతి సాధిస్తున్నారు. జట్టులో పోటీ పెంచుతున్నారు. ప్రతి ఒక్కరూ చోటు కోసం పోరాడాల్సి వస్తోంది. పృథ్వీషా విండీస్‌ టెస్టులో శతకం, 70తో అదరగొట్టాడు. ఇది మన రిజర్వు బెంచ్‌ బలమేంటో చూపిస్తోంది. తుది జట్టు సంగతేమో గానీ ఎంపికయ్యే 15 మందికీ విపరీతమైన పోటీ ఉంది. ఇక నేను 5000 పరుగుల మైలురాయి దాటేశానంటే నేను బాగా ఆడుతున్నట్టే. అందుకు సంతోషంగా ఉంది. ఆసీస్‌, కివీస్‌ పరిస్థితులు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇంతకు ముందూ న్యూజిలాండ్‌లో ఆడాను. అనుభవం ఉండటంతో ఇక్కడెలా ఆడాలో తెలుసు. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ అన్ని వికెట్లపై ఆడేందుకు బాగుంటుంది. ఫుట్‌వర్క్‌లో మార్పులేమీ చేయలేదు’ అని గబ్బర్‌ వెల్లడించాడు.

‘విరాట్‌తో ఆడుతున్నప్పుడు మేమిద్దరం స్ట్రైక్‌ రొటేట్‌ చేసుకుంటాం. ఒత్తిడిని పంచుకుంటాం. ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలను నేను ఇష్టపడతాడు. గౌరవిస్తాను. న్యూజిలాండ్‌లో హాకా నృత్యం చూసేందుకు బాగుంటుంది. స్థానికులు మా వద్దకు వచ్చి హాకా నృత్యం చేసినందుకు అందరం సంతోషించాం. వారి ఆశీర్వాదాలు తీసుకున్నాం. రెండో వన్డేలో విజయం సాధిస్తాం’ అని శిఖర్ ధావన్‌ అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos