రాహుల్ పోరు లౌకిక వాదం పైనా?

రాహుల్ పోరు లౌకిక వాదం పైనా?

తిరువనంతపురం:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల్లో తప్పటడుగు వేశారా? కేరళలోని వయనాడ్ లోక్సభ బరిలోకి దిగి దేశ వ్యాప్తంగా ఉన్న లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు ఆయన పంపుతున్న సంకేతాలు ఏమిటి? బిజెపి బలంగా ఉన్న రాష్ట్రంలో కాకుండా, నామమాత్రంగా ఉన్న కేరళను ఎంపిక చేసుకోవటంలో ఆయన ఆంతర్యం ఏమిటి? అదీ కూడా అక్కడ కూడా ముస్లీంలీగ్తో కలిసి వామపక్షాలకు వ్యతిరేకంగా కత్తులు దూయటంలో అర్ధం ఏమిటి? ఇది దేశ రాజకీయాల్లో తాజా చర్చనీయాంశం. దక్షిణాదిలో కూడా భాజపా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నందున తమ ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలని కొన్ని నెలల కిందట కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ను కోరారు. భాజపా మతోన్మాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యమైతే భాజపా బలంగా ఉన్న కర్నాటకను రాహుల్ ఎంపిక చేసుకుని ఉండాలి. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్, జెడిఎస్ల మధ్య మిత్రత్వం కొనసాగుతోంది. అయినా, కర్నాటకలోని 28 లోక్సభ నియోజకవర్గాల్లో రాహుల్ పోటీ చేసేందుకు ఒక్క సురక్షిత స్థానం కనిపించక పోవటం ఆశ్చర్యం. కర్నాటక బరిలో దిగి ఉంటే భాజపా అభ్యర్థిపై పోటీ పడేవారు. ప్రజల్లోకి ఆ సంకేతమే వెళ్లేది. దీనికి బదులుగా రాహుల్ కేరళలో వామపక్ష కూటమి అభ్యర్థిపై,యుడిఎఫ్ కూటమి ముస్లిం లీగ్తో కలసి తలపడుతుండటం గమనార్హం. ఇక మతోన్మాదంపై పోరాడుతున్నానని రాహుల్ ఎలా చెప్పుకుంటారు?
కేరళలో మతోన్మాద శక్తులతో అడుగడుగునా రాజీ పడిన చరిత్ర కాంగ్రెస్ది. ఇటీవల జరిగిన పరిణామాలు కూడా దీనినే ధ్రువీకరిస్తు న్నాయి. సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ కూటమి మత తత్వ భాజపా, సంఘపరివార్కు వ్యతిరేకంగా, నికరంగా, గట్టిగా నిలబడింది. అనేక పోరాటాలు చేసింది. సిపిఎం కార్యకర్తలు కాషాయ గూండాల చేతుల్లో అసువులు బాశారు. లౌకిక, ప్రజాస్వామ్య కూటమికి వ్యతిరేకంగా ఏకమౌతున్న ఇటువంటి శక్తులను కేరళ ప్రజానీకం గతంలో తరిమికొట్టారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మతోన్మాదం పై పోరాటాన్ని నీరుగార్చటం కాంగ్రెస్కు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించిన చరిత్ర ఆ పార్టీది. దేశంలోనే 80 లోక్సభ స్థానాలు కలిగి, అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో భాజపా ఓటమే లక్ష్యంగా జతకట్టిన ఎస్పి, బిఎస్పి పార్టీలు కూటమికి హస్తం దూరమైంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. మరో ఆరు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దరిమ ఇలా ఈ స్థానాలకే అభ్యర్ధులను ప్రకటించి, మిగిలిన స్థానాల్లో కూటమికి మద్దతు తెలిపి ఉంటే మతోన్మాదం పై పోరాటంలో కాంగ్రెస్ భాగస్వామి అయినట్లు ఉండేది. కానీ మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఎస్పి, బిఎస్పిల కూటమి కోసం ఏడు స్థానాల్లో పోటీ విరమించుకున్నట్లు తెలిపింది. ఓడి పోతామని తెలిసి కూడా ఎస్పి, బిఎస్పి కూటమి పై పోటీకి దిగటాన్ని కూడా మతోన్మాదంపై పోరాటంగా కాంగ్రెస్ ప్రచారాన్ని చేసుకుంటోంది.
తాను ఎన్నికల ప్రచారంలో వామపక్ష కూటమికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడబోనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన పోరు ప్రధానంగా బిజెపితోనే తప్ప వామపక్ష కూటమితో కాదని చెప్పారు. ఉత్తరాది, ఈశాన్యం, ఇప్పుడు దక్షిణాదిన ఆరెస్సెస్, బిజెపిలు ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, దీనిని గట్టిగా ఎదుర్కొనేందుకే తాను దక్షిణాది నుండి పోటీకి దిగానని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos