మోదీ విద్వేషపు వ్యాఖ్యలపై ఈసీ మౌనం

మోదీ విద్వేషపు వ్యాఖ్యలపై ఈసీ మౌనం

న్యూ ఢిల్లీ : రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నిరాకరించింది. ‘నో కామెం ట్’ అంటూ ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి సమాధాన మివ్వడం గమనార్హం. మరోవైపు, ప్రధాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఈసీని కలిసింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చే విధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని మోదీ మాట్లాడారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఏ ప్రధాని కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదంటూ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని వ్యాఖ్యలు దారుణమైనవి. ఎన్నికల కమిషన్ నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైనవిగా కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందని.. మతపరమైన సెంటిమెంట్, విద్వేషాన్ని ప్రధాని మోదీ వెళ్లగక్కుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.
అప్పుడు అలా..
మతం పేరిట ఓట్లు అడిగారంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రేపై గతంలో పెద్దయెత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 1999లో ఆయనపై నిషేధం విధించింది. ఆరేండ్లపాటు ఓటేయకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఈడీ ఎందుకు నిషేధం విధించట్లేదంటూ సోషల్మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos