లోకాయుక్త బలోపేతానికి శ్రీకారం!

లోకాయుక్త బలోపేతానికి శ్రీకారం!

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారానికి కేవలం ఎనిమిది సీట్ల దూరంలో నిలిచిపోవడంతో 14 నెలల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన యడియూరప్ప గతనెలలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న యడియూరప్పకు ఎట్టకేలకు పీఠం దక్కడంతో పాలనలో తనమైన మార్కు చూపడానికి కసరత్తులు చేస్తున్నారు.అందులో భాగంగా గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేసిన లోకాయుక్తను మళ్లీ బలోపేతం చేసే దిశగా యడియూరప్ప అడుగులు వేస్తున్నారు.లోకాయుక్తను నిర్వీర్యం చేసి అవినీతి నిరోధకశాఖను బలోపేతం చేస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన యడియూరప్ప ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే లోకాయుక్తను తిరిగి బలోపేతం చేస్తామంటూ ప్రకటించారు.అందులో భాగంగా ఏసీబీకి అధికారాలు పూర్తిగా తగ్గించి ఏసీబీ స్థానంలో లోకాయుక్తను పటిష్టం చేయడానికి యడియూరప్ప చర్చలు జరుపుతున్నారు.కర్ణాటకలో లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.అవినీతి ఆరోపణలకు సంబంధించి స్వయంగా కేసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టే అధికారం కలిగి ఉన్న లోకాయుక్త అందుకోసం ప్రత్యేకంగా పోలీసు విభాగాన్నిసైతం కలిగి ఉంది.అయితే 2013లో కర్ణాటకలో అధికారంలోకి రావడంతో సిద్దరామయ్య నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2016వ సంవత్సరంలో లోకాయుక్తను రద్దు చేసి దాని స్థానంలో అవినీతి నిరోధక శాఖను తెరపైకి తీసుకువచ్చింది.దీంతో లోకాయుక్త పరిధిలోని కేసులు మినహా మిగిలిన అన్ని అవినీతి ఆరోపణల కేసులను ఏసీబీ విచారణ చేపట్టింది.ఈ క్రమంలో ఏసీబీ విచారణకు స్వీకరించిన ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఏసీబీపై అప్పటి ప్రతిపక్ష నేత యడియూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏసీబీ తెరమీదకు వచ్చిన తరువాత లోకాయుక్తకు అధికారాలు తగ్గించారని లోకాయుక్తను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఏసీబీని ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. లోకాయుక్త అధికారాలను లాక్కోవడానికి ఏసీబీ ప్రయత్నిస్తున్నదని పలువురు విమర్శలు చేశారు.ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం లోకాయుక్తను నిర్వీర్యం చేసి ఏసీబీని తెరపైకి తీసుకురావడంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.అయినా సిద్దరామయ్య ప్రభుత్వం ఇవేమి లెక్కచేయకుండా ఏసీబీని ఏర్పాటు చేసి తన పంతం నెగ్గించుకుంది.ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు ఇస్తామని గత శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసింది.దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లోకాయుక్తను మళ్లీ బలోపేతం చేయడానికి యడియూరప్ప అడుగులు వేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఏసీబీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పినట్లు ఏసీబీ నడుచుకుంటోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకే యడియూరప్ప ప్రభుత్వం ఏసీబీని రద్దు చెయ్యాలని ఆలోచిస్తోందని సమాచారం.రాజకీయ ప్రస్థానం చరమాంకానికి చేరుకున్న నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తన పేరును ప్రజల్లో శాశ్వతం చేసుకోవడానికి యడియూరప్ప కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే లోకాయుక్తను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టారని దీంతోపాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడానికి యడియూరప్ప కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది..

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos