ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ భాజపా హవా…!

ఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ నెల 21న జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధిస్తుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను భాజపా, మిత్ర పక్షం శివసేనతో కలసి 194 సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్-ఎన్సీపీలు 86 స్థానాలతో తృప్తి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. ఇతరులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తారని తెలపింది. ముంబై, కొంకణ్, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, విదర్భల్లో భాజపా-శివసేన తిరుగులేని ఆధిక్యతను సాధించబోతున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో భాజపా-శివసే సంకీర్ణ ప్రభుత్వం గత అయిదేళ్లుగా అధికారంలో ఉంది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోగా, గత ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలకు భాజపా సొంతం చేసుకుంటుందని సర్వే తెలిపింది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను భాజపా 83 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించబోతోందని పేర్కొంది. కాంగ్రెస్‌కు మూడు, ఇతరులకు నాలుగు స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ 47 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అంతకు ముందు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. ఐఎన్‌డీఎల్‌ 19, హర్యానా జనహిత్ కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఈ రెండు రాష్ర్ష్ట్రాల్లో ఈ నెల 24న ఓట్ల లెక్కింపు చేపడతారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos